
ఒంగోలు: రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగానే సర్వెంట్లు వినమ్రంగా తీసుకురావడం ఇప్పటివరకు చూసుంటారు. ఇది రోటీన్..! ట్రెండ్ ఫాలో అయితే ఏముంటుంది.. ట్రెండ్ సెట్ చేస్తేనే కదా అసలు మజా అని భావించారు ఒంగోలు నగరంలోని జీబు రెస్టారెంట్ నిర్వాహకులు. ఒంగోలు నగరవాసులకు సరికొత్త అనుభూతిని కలగజేసేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ఒంగోలులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జీబు రెస్టారెంట్ విశేషాలు
ఒంగోలు నగరంలో సర్వెంట్ రోబో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భోజన ప్రియులంతా ఆ రోబో గురించే చర్చించుకుంటున్నారు. స్థానిక ట్రంకు రోడ్డులోని పాత ఎల్‌ఐసీ భవనం మొదటి, రెండో అంతస్తుల్లో ఇటీవల జీబు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. జీబు అనగానే ‘ఇదేం పేరు’ అనుకోవడం పరిపాటి. అయితే దీనికో చరిత్ర ఉంది. జీబు అనేది బ్రెజిల్ పదం. బ్రెజిల్ పరిభాషలో జీబు అంటే ఒంగోలు గిత్త అని అర్థం. అందుకే జీబు లోగోలో ఒంగోలు గిత్త కనిపించేలా రూపొందించారు.
ఫ్లయిట్ థీమ్
విమానంలో కూర్చుని భోజనం చేస్తున్న ఫీలింగ్ కలిగేలా రెస్టారెంట్ మొదటి అంతస్తులో ఫ్లయిట్ థీమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్వెంట్లు ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా కస్టమర్లను చిరునవ్వుతో పలకరిస్తూ ఆర్డర్ తీసుకుంటున్నారు. వంట గది నుంచి టేబుల్ వరకు నేరుగా రోబోనే ఫుడ్ తీసుకువస్తుంది. రెస్టారెంట్‌లో ఇలాంటి రోబోలు మూడు ఉన్నాయి. రోబోలను జపాన్‌లో కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా ఫారెస్ట్ సెట్టింగ్
హోటల్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన కుటీరంలో లాంతర్ల వెలుగులో దట్టమైన అడవిలో భోజనానికి కూర్చున్న ఫీలింగ్ కలిగేలా డైనింగ్ హాల్‌ను తీర్చిదిద్దారు. దేశంలో కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో రోబోలతో ఫుడ్ సర్వ్ చేసే హోటళ్లున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒంగోలు నగరంలో తాము ఏర్పాటు చేశామని రెస్టారెంట్ నిర్వాహకుడు ఆరిగ సాయి తెలిపారు.

ఫారెస్ట్ సెట్టింగ్‌తో డైనింగ్ హాల్
Comments
Please login to add a commentAdd a comment