మహారాణిపేట : వరుస ధర్నాలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఏపీ స్టేట్ ప్రభుత్వ కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఫెడరేషన్.. అనకాపల్లి, మునగపాక మండలాల్లో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ.. వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ జరిపించాలని ఏపీ స్టేట్ ఔట్‌సోర్సింగ్, కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు.
10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి
పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ ఏపీ స్టేట్ కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 3 లక్షల మంది కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఐదేళ్లుగా ఒక్క రూపాయి జీతం పెంచలేదని వాపోయారు. ఇచ్చిన జీతాలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచడమే కాకుండా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నగర కన్వీనర్ ఎస్.ఇందీవర, రాష్ట్ర నాయకులు వి.రాంప్రసాద్, కె.ఈశ్వరరావు, ఎస్.అమీర్, ఎన్.కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
లాజిస్టిక్ పార్క్‌ను రద్దుచేయాలి
అనకాపల్లి, మునగపాక మండలాల్లో 500 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ పార్క్‌ను విరమించుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టి.సిరసపల్లి, వెంకటాపురం, రామారాయుడుపేట, తానాం, తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. 40 ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో పార్కులు కడతారా? అని ప్రశ్నించారు. మీ సోకులకు మా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధర్నాలో వెంకటాపురం సర్పంచ్ సుందరపు కనక అప్పారావు, సీఐటీయూ నాయకలు గనిశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలి
వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలపై విచారణ చేపట్టాలని కోరుతూ నిరుద్యోగ వికలాంగుల జేఏసీ ధర్నా చేపట్టింది. జిల్లాలో 52 బ్యాక్‌లాగ్ ఉద్యోగాల (వికలాంగులు) భర్తీకి మార్చి 14న ఇచ్చిన నోటిఫికేషన్‌లో దొర్లిన తప్పులను సవరించాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. పోస్టుల భర్తీలో కాసులకు కక్కుర్తిపడి జీవో 31, 104ను కూడా వికలాంగుల సంక్షేమశాఖాధికారులు తుంగలో తొక్కారన్నారు. కార్యక్రమంలో వికలాంగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డేవిడ్‌రాజు, ఎన్‌పీఆర్‌డీ అధ్యక్షుడు రాంబాబు, డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
దద్దరిల్లిన కలెక్టరేట్
Published Tue, Aug 18 2015 2:12 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM
Advertisement
Advertisement