ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధిగాంచిన బారా షాహిద్‌దర్గాలో మంగళవారం నుంచి రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు.. దుబాయ్ నుంచి కూడా మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధానంగా రూ.1.57 కోట్లతో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. 1,981 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 4,500 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు.. దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువులో నీటి నిల్వకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్వర్ణాల చెరువులో 11.5 అడుగుల మేర నీరుండేలా చర్యలు తీసుకున్నారు. దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేశారు. ప్రధాన విభాగాల అధికారులంతా పర్యవేక్షించనున్నారు.
కిటకిటలాడుతున్న దర్గా ప్రాంగణం
మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్యర్య రస్తోగిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం మంత్రి, ఎమ్మెల్యే తదితరులు దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వారు ఆదివారం నుంచే తరలివస్తుండటంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. పదో తేదీన షహదాత్, 11న గంధం మహోత్సవం, నగరంలోని కోటమిట్ట వద్ద ఉన్న మసీదు నుంచి గంధం ఉరేగింపు నిర్వహించి దర్గాకు తీసుకొస్తారు. 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహో, 14న ముగింపు సభ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment