కుళ్లిన గుడ్లు
మెరకముడిదాం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఉన్నత పాఠశాలలో 441 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో భోజనం చేసే విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులు 290 గుడ్లు ఉడకబెట్టారు. అయితే ఇందులో 30 గుడ్ల వరకు ఉడికిస్తుండగానే పైకి తేలాయి.
వెంటనే నిర్వాహకురాలు వాటిని తీసి పరిశీలించగా పాడవ్వడంతో బయటకు తీసేశారు. ఈ విషయాన్ని వెంటనే పాఠశాల హెచ్‌ఎం ఎం.శివున్నాయుడుకు తెలియజేయగా, వాటి స్థానంలో కొత్తగుడ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గుడ్లు సరఫరా చేసే సమయంలో పాడైన గుడ్లు ఇచ్చినప్పుడు సిబ్బంది గమనించలేదా..?... కనీసం భోజన నిర్వాహకులకు ఇచ్చినప్పుడైనా ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే విషయం తెలుసుకున్న సాక్షి ఈ విషయంపై ఆరా తీయగా వండిన గుడ్లలో సుమారు 180 వరకు కుళ్లిపోయినట్లు తెలిసింది. అయితే గుడ్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీ యాజమాని సమాధానానికి, జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం సమాధానానికి పొంతన లేకుండా పోతోంది. పాఠశాలకు గుడ్లను సరఫరా చేస్తున్న విజయనగరానికి చెందిన శ్రీమారుతి ఆగ్రో ఏజెన్సీ యజమాని జి.రాజేష్‌ని సాక్షి ఫోన్‌లో సంప్రదించగా తమ ఏజెన్సీ ద్వారానే గుడ్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు.
అయితే బ్లూ కలర్ స్టాంప్ ఉన్న 993 గుడ్లను జూన్ 15వ తేదీన.. అలాగే అదే నెల 28న రెడ్ కలర్ స్టాంప్ వేసిన 993 గుడ్లు సరఫరా చేశామని తెలిపారు. గత నెల 15వ తేదీన సరఫరా చేసిన గుడ్లను ఇప్పడు వండడం వల్లే కుళ్లిపోయి ఉండవచ్చని యజమాని చెబుతుంటే.. పాఠశాల ప్రధానోపాధ్యాయు ఎం.శివున్నాయుడు మాట్లాడుతూ, గత నెల 24న బ్లూ కలర్ స్టాంప్ ఉన్న గుడ్లు సరఫరా చేశారని.. అలాగే 30న రెడ్ కలర్ స్టాంప్ వేసి ఉన్న గుడ్లు సరఫరా చేశారని చెబుతున్నారు.
వీళ్లిద్దరి సమాధానాలు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ గుడ్లను విద్యార్థులకు పెట్టకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
గతంలో కూడా..
గతేడాది కూడా ఇదే పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు వచ్చాయి. వంట నిర్వాహకులు, ఉపాధ్యాయులు అప్రమత్తమై ఆ గుడ్లను పక్కకు తీసేయ్యడంతో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోలేదు. మళ్లీ అదే తరహా సంఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గుడ్లు సరఫరా చేసే యజమానితో పాటు పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత నెలలో సరఫరా చేశాం..
గత నెల 15న బ్లూ కలర్ స్టాంప్‌తో... మళ్లీ 28న రెడ్ కలర్ స్టాంప్‌తో పాఠశాలకు గుడ్లు సరఫరా చేశాం. అయితే బుధవారం వండిన గుడ్లు గత నెల 15న సరఫరా చేసినవి కావడంతో కుళ్లిపోయి ఉండవచ్చు. ఎప్పుడిచ్చిన గుడ్లు అప్పుడే వండితే సమస్య ఉండదు.
– జి.రాజేష్, మారుతీ ఆగ్రో ఏజెన్సీ యజమాని, విజయనగరం.
ఉన్నతాధికారుల దృష్టికి ..
పాఠశాలలో బుదవారం వండిన గుడ్లలో 30 వరకు కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అలాగే గుడ్లు సరఫరా చేసిన యజమానితో మాట్లాడాను.ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాధు కూడా చేస్తాను.
– ఎం.శివున్నాయుడు, హెచ్‌ఎం, జెడ్పీ ఉన్నతపాఠశాల, మెరకముడిదాం
వండుతుండగా చూశాను..
విద్యార్థుల సంఖ్యను బట్టి 290 గుడ్లు ఉడకబెట్టిమని ఇచ్చారు. వండుతుండగా 30 గుడ్లు తేలిపోవడాన్ని గుర్తించాను. పరిశీలించగా గుడ్లు కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లి, మళ్లీ కొత్త గుడ్లు వేశాం.
– సత్యవతి, వంట నిర్వాహకురాలు, మెరకముడిదాం
Comments
Please login to add a commentAdd a comment