rotten eggs
-
ఈ భోజనం మాకొద్దు
సాక్షి, ఆలూరు (ప్రకాశం):‘ఈ పాడు భోజనం మాకొద్దు, మురిగిపోయిన గుడ్లు అలసలే వద్దు, తిరిగి తీసుకెళ్లండి’ అని ఆలూరు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగా లేదని, కూరలు రుచిగా లేవని, వండిన గుడ్లు దుర్వాస వస్తున్నాయంటూ విద్యార్థులు ఆహారాన్ని కింద పడేయడం పరిపాటిగా మారింది. మంగళవారం ఎంపీడీఓ పి.సుజాత బూత్‌ల పరిశీలన కోసం వచ్చిన సందర్భంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ భోజనం బాగులేదని, చెడిపోయిన గుడ్లు పంపిస్తున్నారని, కూర రుచికరంగా లేదని కాంట్రాక్టరుకు ఇచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతోందని ఎంపీడీఓ దృష్టికి తీసికెళ్లారు. నాశిరకం భోజనం వండిపెడుతున్నారని, తాజా భోజనం వండిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నివేదిక తయారుచేసి జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లతానని చెప్పారు. అనంతరం ఆలూరులో పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ బూత్‌లో విద్యుత్ ఉందా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. లేని వాటికి వెంటనే వేయించాలని ఆయా హెచ్ఎంలను ఆదేశింశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎల్వీఎన్ రమేష్, తోట రంగారావు, దొడ్ల రాజుగోపాల్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు
జయపురం: పాఠశాలలకు రప్పించేందుకు పిల్లలకు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని నిర్దేశించిన మధ్యాహ్న భోజన పథకం గతి తప్పుతోంది. మొదటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం అప్పగించింది. అయితే దీంతో అనేక ఇబ్బందులతో పాటు అవినీతి కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో స్వయం సహాయక గ్రూపుల లాంటి కొన్ని సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించారు. అయితే వారి నిర్వహణలో కూడా విమర్శలు రావడంతో నేడు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఒప్పంద సమయంలో విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన పౌష్టికాహారం అందజేస్తామని ప్రైవేట్ సంస్థ వాగ్దానం చేసింది. కానీ వారు సరఫరా చేసే ఆహారంలో నాణ్యతలేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో.. పాఠశాలలకు వారు సరఫరా చేసిన కోడిగుడ్లలో కుళ్లినపోయినవి, పురుగులు ఉన్నవి బయటపడ్డాయి. జయపురం సెంట్రల్ యూపీ స్కూలులో విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం పెడుతున్న సమయంలో గుడ్లు కూడా పెట్టారు. అయితే అవి కుళ్లిపోయినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. ఈ విషయం వారు విద్యావిభాగ అధికారులకు తెలియజేశారు. వెంటనే వారు వచ్చి ఆ గుడ్లను పరిశీలించారు. కుళిపోయి, పురుగులున్న గుడ్ల ఫొటోలను తీశారు. ఉపాధ్యాయులు గుడ్లను పాత్రికేయులకు చూపించారు. దీనిపై విచారణ జరిపిస్తామని అధికారులు తెలిపారు. ఇటువంటి ఆహారం తింటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలి మరి. -
మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు
మెరకముడిదాం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఉన్నత పాఠశాలలో 441 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో భోజనం చేసే విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులు 290 గుడ్లు ఉడకబెట్టారు. అయితే ఇందులో 30 గుడ్ల వరకు ఉడికిస్తుండగానే పైకి తేలాయి. వెంటనే నిర్వాహకురాలు వాటిని తీసి పరిశీలించగా పాడవ్వడంతో బయటకు తీసేశారు. ఈ విషయాన్ని వెంటనే పాఠశాల హెచ్ఎం ఎం.శివున్నాయుడుకు తెలియజేయగా, వాటి స్థానంలో కొత్తగుడ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. గుడ్లు సరఫరా చేసే సమయంలో పాడైన గుడ్లు ఇచ్చినప్పుడు సిబ్బంది గమనించలేదా..?... కనీసం భోజన నిర్వాహకులకు ఇచ్చినప్పుడైనా ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే విషయం తెలుసుకున్న సాక్షి ఈ విషయంపై ఆరా తీయగా వండిన గుడ్లలో సుమారు 180 వరకు కుళ్లిపోయినట్లు తెలిసింది. అయితే గుడ్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీ యాజమాని సమాధానానికి, జెడ్పీ పాఠశాల హెచ్ఎం సమాధానానికి పొంతన లేకుండా పోతోంది. పాఠశాలకు గుడ్లను సరఫరా చేస్తున్న విజయనగరానికి చెందిన శ్రీమారుతి ఆగ్రో ఏజెన్సీ యజమాని జి.రాజేష్‌ని సాక్షి ఫోన్లో సంప్రదించగా తమ ఏజెన్సీ ద్వారానే గుడ్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే బ్లూ కలర్ స్టాంప్ ఉన్న 993 గుడ్లను జూన్ 15వ తేదీన.. అలాగే అదే నెల 28న రెడ్ కలర్ స్టాంప్ వేసిన 993 గుడ్లు సరఫరా చేశామని తెలిపారు. గత నెల 15వ తేదీన సరఫరా చేసిన గుడ్లను ఇప్పడు వండడం వల్లే కుళ్లిపోయి ఉండవచ్చని యజమాని చెబుతుంటే.. పాఠశాల ప్రధానోపాధ్యాయు ఎం.శివున్నాయుడు మాట్లాడుతూ, గత నెల 24న బ్లూ కలర్ స్టాంప్ ఉన్న గుడ్లు సరఫరా చేశారని.. అలాగే 30న రెడ్ కలర్ స్టాంప్ వేసి ఉన్న గుడ్లు సరఫరా చేశారని చెబుతున్నారు. వీళ్లిద్దరి సమాధానాలు ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఈ గుడ్లను విద్యార్థులకు పెట్టకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో కూడా.. గతేడాది కూడా ఇదే పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు వచ్చాయి. వంట నిర్వాహకులు, ఉపాధ్యాయులు అప్రమత్తమై ఆ గుడ్లను పక్కకు తీసేయ్యడంతో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోలేదు. మళ్లీ అదే తరహా సంఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గుడ్లు సరఫరా చేసే యజమానితో పాటు పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెలలో సరఫరా చేశాం.. గత నెల 15న బ్లూ కలర్ స్టాంప్‌తో... మళ్లీ 28న రెడ్ కలర్ స్టాంప్‌తో పాఠశాలకు గుడ్లు సరఫరా చేశాం. అయితే బుధవారం వండిన గుడ్లు గత నెల 15న సరఫరా చేసినవి కావడంతో కుళ్లిపోయి ఉండవచ్చు. ఎప్పుడిచ్చిన గుడ్లు అప్పుడే వండితే సమస్య ఉండదు. – జి.రాజేష్, మారుతీ ఆగ్రో ఏజెన్సీ యజమాని, విజయనగరం. ఉన్నతాధికారుల దృష్టికి .. పాఠశాలలో బుదవారం వండిన గుడ్లలో 30 వరకు కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అలాగే గుడ్లు సరఫరా చేసిన యజమానితో మాట్లాడాను.ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాధు కూడా చేస్తాను. – ఎం.శివున్నాయుడు, హెచ్ఎం, జెడ్పీ ఉన్నతపాఠశాల, మెరకముడిదాం వండుతుండగా చూశాను.. విద్యార్థుల సంఖ్యను బట్టి 290 గుడ్లు ఉడకబెట్టిమని ఇచ్చారు. వండుతుండగా 30 గుడ్లు తేలిపోవడాన్ని గుర్తించాను. పరిశీలించగా గుడ్లు కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లి, మళ్లీ కొత్త గుడ్లు వేశాం. – సత్యవతి, వంట నిర్వాహకురాలు, మెరకముడిదాం -
మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు
♦ పాఠశాలలకు అందజేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ♦ ఇబ్బంది పడుతున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు రాజంపేట టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడు ఉన్నా కాంట్రాక్టర్ల జేబులు నింపుతారనేందుకు మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న కోడుగుడ్లు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత నెల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకులే వారానికి రెండు కోడి గుడ్లను విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ నెల 1 నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్లను సరఫరా చేసే బాధ్యతను ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పజెప్పింది. దీంతో ఆ సంస్థ కడప జిల్లాతోపాటు మరో రెండు జిల్లాలకు కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అయితే మండలంలో అనేక పాఠశాలలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు చాలా వరకు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నాయి. వాటిని ఉడకబెట్టి బొప్పెట తీసే సమయంలో.. భరించలేని దుర్వాసన వస్తుండటంతో వంట మనుషులు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే గుడ్లు కుళ్లిపోవడం వల్ల వంట ఏజెన్సీ నిర్వాహకులు వాటిని పడేసి దుకాణాల్లో కొనుగోలు చేసి విద్యార్థులకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల మధ్యాహ్న వంట ఏజెన్సీ నిర్వాహకులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. కోడిగుడ్లను ప్రభుత్వం కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తున్నందున.. ఒక్కొక్క దానికి రూ.2.35లను వంట ఏజెన్సీల బిల్లు నుంచి వసూలు చేస్తుంది. అయితే గుడ్లు చెడిపోవడం వల్ల నిర్వాహకులు బయట దుకాణాల్లో కొనుగోలు చేసి విద్యార్థులకు పెడుతుండటంతో చేతి నుంచి డబ్బులు వేసుకోవాల్సి వస్తోంది. తగ్గిన సైజు కోడిగుడ్ల సైజు చాలా తగ్గింది. సాధారణంగా 40 నుంచి 50 గ్రాముల వరకు కోడిగుడ్డు ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అవుతున్న గుడ్ల సైజు 30 నుంచి 35 గ్రాములు మాత్రమే ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఖర్చుకు వెనకాడమని గతంలో పలు మార్లు వివిధ సభల్లో చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థులకు ప్రస్తుతం పెడుతున్న కోడిగుడ్డు సైజు భారీగా తగ్గడంతో పేద పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన, పెద్దసైజు కోడి గుడ్లను సరఫరా చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
పిల్లలకు కుళ్లిపోయినా గుడ్లా..?: కమల్ హాసన్
చెన్నై: తమిళనాడు ఏఐడీఎంకే (అమ్మ) ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా కమలహాసన్ తన స్వరాన్ని పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెరంబుళూర్ జిల్లాలో అంగన్వాడీలకు కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే కమల్ అభిమానులకు ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే అభిమానులు పెరంబళూర్లో పిల్లలకు పోషకాహారంగా కుళ్లి పోయిన గుడ్లు ఇస్తున్నారని కమల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కమల్ స్పందిస్తూ కుళ్లిపోయిన గుడ్లతో పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని, సమస్యను లేవనెత్తే ముందు లాయర్ సలహా తీసుకొమని, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించ వద్దని అభిమానులకు సూచించారు. ఈ ఆరోపణలతో పెరంబుళూర్ జిల్లా కలెక్టర్ వి.శాంతా విచారణకు ఆదేశించారు. దీనిపై ఆమెను మీడియా వివరణ కోరగా నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నామని, అలాంటిది జరుగదని గుడ్లు కుళ్లిపోతే మార్చుకునే సదుపాయం ఉందని పేర్కొన్నారు. ఇక కమల్‌పై మంత్రులు తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. ఏనాడైనా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించారా..? ఇప్పుడేదో ఉద్దరించేందుకు బయలు దేరినట్టుగా మాట్లాడుతున్నారని రావాలనుకుంటే, రాజకీయాల్లోకి రా.. అని కమలహాసన్‌కు ఆర్థికశాఖ మంత్రి జయకుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చైన్నైలో వరదలొచ్చినపుడు.. సునామీ సంభవించినపుడు కమల్‌హాసన్ ఎక్కడున్నాడని మంత్రులు కమల్‌పై విరుచుకుపడుతున్నారు.