పిల్లలకు కుళ్లిపోయినా గుడ్లా..?: కమల్ హాసన్
అంగన్‌వాడీలకు కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని కమల్ హాసన్ నిలదీశారు.
చెన్నై: తమిళనాడు ఏఐడీఎంకే (అమ్మ) ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు వ్యతిరేకంగా కమలహాసన్ తన స్వరాన్ని పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పెరంబుళూర్ జిల్లాలో అంగన్‌వాడీలకు కుళ్లిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే కమల్ అభిమానులకు ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అయితే అభిమానులు పెరంబళూర్‌లో పిల్లలకు పోషకాహారంగా కుళ్లి పోయిన గుడ్లు ఇస్తున్నారని కమల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కమల్ స్పందిస్తూ కుళ్లిపోయిన గుడ్లతో పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని, సమస్యను లేవనెత్తే ముందు లాయర్ సలహా తీసుకొమని, చట్టవ్యతిరేకంగా ప్రవర్తించ వద్దని అభిమానులకు సూచించారు. ఈ ఆరోపణలతో పెరంబుళూర్ జిల్లా కలెక్టర్ వి.శాంతా విచారణకు ఆదేశించారు. దీనిపై ఆమెను మీడియా వివరణ కోరగా నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నామని, అలాంటిది జరుగదని గుడ్లు కుళ్లిపోతే మార్చుకునే సదుపాయం ఉందని పేర్కొన్నారు.
ఇక కమల్‌పై మంత్రులు తీవ్రంగానే విరుచుకుపడుతున్నారు. ఏనాడైనా ప్రజా సమస్యల గురించి ప్రస్తావించారా..? ఇప్పుడేదో ఉద్దరించేందుకు బయలు దేరినట్టుగా మాట్లాడుతున్నారని రావాలనుకుంటే, రాజకీయాల్లోకి రా.. అని కమలహాసన్‌కు ఆర్థికశాఖ మంత్రి జయకుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చైన్నైలో వరదలొచ్చినపుడు.. సునామీ సంభవించినపుడు కమల్‌హాసన్ ఎక్కడున్నాడని మంత్రులు కమల్‌పై విరుచుకుపడుతున్నారు.