మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు
♦ పాఠశాలలకు అందజేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ
♦ ఇబ్బంది పడుతున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు
రాజంపేట టౌన్:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడు ఉన్నా కాంట్రాక్టర్ల జేబులు నింపుతారనేందుకు మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న కోడుగుడ్లు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత నెల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకులే వారానికి రెండు కోడి గుడ్లను విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ నెల 1 నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్లను సరఫరా చేసే బాధ్యతను ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పజెప్పింది. దీంతో ఆ సంస్థ కడప జిల్లాతోపాటు మరో రెండు జిల్లాలకు కోడిగుడ్లను సరఫరా చేస్తోంది.
అయితే మండలంలో అనేక పాఠశాలలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు చాలా వరకు కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నాయి. వాటిని ఉడకబెట్టి బొప్పెట తీసే సమయంలో.. భరించలేని దుర్వాసన వస్తుండటంతో వంట మనుషులు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. ఇదిలా ఉంటే గుడ్లు కుళ్లిపోవడం వల్ల వంట ఏజెన్సీ నిర్వాహకులు వాటిని పడేసి దుకాణాల్లో కొనుగోలు చేసి విద్యార్థులకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల మధ్యాహ్న వంట ఏజెన్సీ నిర్వాహకులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. కోడిగుడ్లను ప్రభుత్వం కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేస్తున్నందున.. ఒక్కొక్క దానికి రూ.2.35లను వంట ఏజెన్సీల బిల్లు నుంచి వసూలు చేస్తుంది. అయితే గుడ్లు చెడిపోవడం వల్ల నిర్వాహకులు బయట దుకాణాల్లో కొనుగోలు చేసి విద్యార్థులకు పెడుతుండటంతో చేతి నుంచి డబ్బులు వేసుకోవాల్సి వస్తోంది.
తగ్గిన సైజు
కోడిగుడ్ల సైజు చాలా తగ్గింది. సాధారణంగా 40 నుంచి 50 గ్రాముల వరకు కోడిగుడ్డు ఉంటుంది. ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అవుతున్న గుడ్ల సైజు 30 నుంచి 35 గ్రాములు మాత్రమే ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, అంగన్‌వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో ఖర్చుకు వెనకాడమని గతంలో పలు మార్లు వివిధ సభల్లో చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థులకు ప్రస్తుతం పెడుతున్న కోడిగుడ్డు సైజు భారీగా తగ్గడంతో పేద పిల్లలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన, పెద్దసైజు కోడి గుడ్లను సరఫరా చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.