
గుంటూరు నగరంలోని చిల్లీస్ రెస్టారెంట్‌లో ఫ్రిజ్‌లలో పెట్టిన మాంసం నిల్వలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు
నగరంపాలెం(గుంటూరు): కుళ్లిన స్థితిలో నిల్వ చేసి ఉంచిన మాంసం.. బూజుపట్టిన చేపలు.. కిలోల కొద్దీ డీప్ ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉంచిన దృశ్యాలు మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ప్రజారోగ్య అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెలుగు చూశాయి. ఆదివారం వెన్‌లాక్ మార్కెట్‌లోని పలు మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. మార్కెట్‌లోని ఒక దుకాణంలో 200 కేజీల వరకు డీప్ ఫ్రిజ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న చికెన్‌ను, ఫంగస్ పట్టిన చేపలను అధికారులు గుర్తించారు. దీంతో షాపు నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు రూ.30 వేల అపరాధ రుసుం విధించారు. రోసారి పునరావృతమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడే అపరిశుభ్ర ప్రదేశాల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని, ఈగలు ముసురుతున్న మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేటలోని చికెన్ స్టాల్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రంగా ఉన్న నీటిలో ఉన్న నానబెట్టిన చికెన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై షాపు యజమానికి రూ.5 వేల అపరాధ రుసుం విధించారు. పరిశుభ్ర వాతావరణంలోనే కోళ్లను వధించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి రోడ్డులో చిల్లీస్ రెస్టారెంట్, అరబిక్ రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల్లో చికెన్ పీస్‌లు, వండటానికి సిద్ధం చేసిన చికెన్ నిల్వలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెస్టారెంట్ నిర్వాహకులకు రూ.5 వేల చొప్పున అపరాధ రుసుం విధించారు.
అవగాహన, తనిఖీలు నిర్వహించాలి
ఈ సందర్భంగా రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసం అందించటానికి ప్రజారోగ్యశాఖకు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సంబంధిత డివిజన్లలోని చికెన్, మటన్ స్టాల్స్‌లో పరిశుభ్రంగా ఉండేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు. రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఫుడ్ తనిఖీ అధికారులు, తూనికలు, కొలతల శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారి డాక్టరు శోభారాణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment