- విచారణ చేపట్టిన బ్యాంకు అధికారులు
- అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘటన
పుట్లూరు: ఓ రైతు అకౌంట్లో రూ. 1.84 కోట్లు జమ అయిన సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే 24 గంటలు గడవకముందే జమ అయిన మొత్తం ఖాతాలో కనిపించకుండా పోయింది. పుట్లూరు మండలం కోమటికుం ట్లకు చెందిన శ్రీనివాసులనాయుడు అనే రైతుకు తాడిపత్రిలోని ఆంధ్రా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఇందులో ఈ నెల 16న రూ. 960 మాత్రమే ఉండటంతో కనీస బ్యాలెన్స్ రూ. 1,000 ఉండటానికి వీలుగా బ్యాంకుమిత్రగా పనిచేస్తున్న అతని భార్య సుజాత రూ. 40 బదిలీ చేసింది.
వెంటనే అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ. 1.84 కోట్లు ఉన్నట్లు మేసేజ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన శ్రీనివాసులనాయుడు బ్యాంకు అధికారులకు విషయం చెప్పేందుకు శనివారం ఉదయమే ఆ బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడ రద్దీగా ఉండటంతో వెనక్కు తిరిగి వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి అతని అకౌంట్లో కేవలం రూ. 130 మాత్రమే ఉన్నట్లు మరోమారు మెసేజ్ వచ్చినట్లు రైతు శ్రీనివాసులనాయుడు తెలిపారు. తనకు తెలియకుండా డబ్బు జమ కావడంతో పాటు తన అకౌంట్లోని రూ. 870 తగ్గిపోవడంపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు శ్రీనివాసులనాయుడు విలేకరులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు కర్నూలు నుంచి తమ సిబ్బందిని పంపి ఆదివారం శ్రీనివాసులనాయుడు అకౌంట్‌పై విచారణ చేపట్టినట్లు సమాచారం.
మహిళా కూలీ ఖాతాలోకి కోటిన్నర
టీనగర్(చెన్నై): కూలీనాలీ చేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళ ఖాతాలోకి రూ. 1.5 కోట్లు జమైంది. దీంతో ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తేనిలో చోటుచేసుకుంది. తేని సమీప నాగలాపురానికి చెందిన మునియమ్మాళ్(60) కూలీ కార్మికురాలు. భర్తను కోల్పోయిన ఈమెకు వితంతు పింఛన్ అందుతోంది. ఈ నేపథ్యంలో మునియమ్మాళ్ పింఛన్ తీసుకునేందుకు శనివారం బ్యాంకుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు అందులో రూ. 1.5 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఐటీ అధికారులు సదరు బ్యాంకు అధికారుల వద్ద విచారణ చేపట్టారు.
రైతు ఖాతాలో రూ. 1.84 కోట్లు జమ
Published Mon, Dec 19 2016 2:43 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement