- పోస్టుమాస్టర్ జనరల్‌కు క్యాట్ ఆదేశం
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా నియామకాలు చేపట్టి, 11 ఏళ్ల సర్వీసు తర్వాత అవే ఆదేశాలను సాకుగా చూపి ఉద్యోగిని తొలగించిన పోస్టల్ శాఖ తీరును కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా రూ. లక్ష చెల్లించాలని పోస్టుమాస్టర్ జనరల్‌ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని విజయవాడ (ఉత్తర సబ్ డివిజన్) పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ) జీతం నుంచి తీసుకోవచ్చని చెప్పింది. భవిష్యత్తు నియామకాల్లో బాధితుడికి అవకాశం కల్పించాలని క్యాట్ సభ్యులు రంజనా చౌదరి, వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది.
వివరాల్లోకెళితే.. విజయవాడకు చెందిన వి.రమణయ్యను 2004లో రైల్వే వ్యాగల్ వర్క్‌షాప్‌లో మెయిల్ డెలివరర్ ఉద్యోగిగా నియమించారు. అయితే ఈ పోస్టుకు నియామకం చేపట్టరాదని 2002లో హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అవి పట్టించుకోకుండా విజయవాడ ఏఎస్పీ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయంలో 2012లో హైకోర్టు తుది తీర్పునిస్తూ తాజాగా నియామకం చేపట్టాలని ఆదేశించింది. దీంతో రమణయ్యను విధుల నుంచి తొలగించారు. చేయని తప్పుకు విధుల నుంచి తొలగించారంటూ రమణయ్య క్యాట్‌ను ఆశ్రయించారు.