
రాజధాని నిర్మాణానికి త్వరలో రూ.వెయ్యి కోట్లు
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు మరో 20 రోజుల్లో అందనున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో రాజధాని నిర్మాణానికి రూ.20 వేల కోట్ల సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌తో కలిసి సుజనా చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకున్నా కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.
నాకేమీ అవమానం కాదు
తనతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యేందుకు విముఖత చూపారన్న వార్తలను ప్రస్తావించగా.. సుజనా చౌదరి బదులిస్తూ కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం కారణంగానే ఇలా జరిగింది తప్ప వేరే అంశం లేదన్నారు.తనకు అవమానం జరిగినట్లు భావించట్లేదని స్పష్టం చేశారు. అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం ఇటీవల మాట్లాడుతూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లు ప్రకటించడాన్ని విలేకరులు సుజనా వద్ద ప్రస్తావించగా.. ఆయన కొట్టిపారేశారు.