కొండంత పర్వానికి..గోరంత వరమే
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాటిపర్యటన వికలాంగ దినోత్సవం, పుష్కర పనులపై సమీక్ష, పుష్కరఘాట్‌ల పరిశీలన.. ఈ మూడు అంశాలపైనే కేంద్రీకృతమైంది. వికలాంగుల దినోత్సవంలో వారి సంక్షేమానికి వేల కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించిన బాబు ప్రతిష్టాత్మకమైన పుష్కర పనులకు నిధుల విషయంలో ‘అతి పొదుపు’ పాటించారని వివిధశాఖల అధికారులు, నేతలు పెదవి విరిచారు. సీఎం పరిశీలనకు వస్తారనుకుని కొన్ని గోదావరి ఘాట్‌ల వద్ద నిరీక్షించిన ఇసుక ర్యాంపుల నిర్వాహకులైన మహిళా సంఘాల వారు ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎం సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి పర్యటన నేతల హడావిడి, కార్యకర్తల హంగామా, పోలీసుల ఓవర్ యాక్షన్ మధ్య ముగిసింది. ఇక్కడి చెరుకూరి కళ్యాణమండపంలో బుధవారం నిర్వహించిన వికలాంగుల దినోత్సవంలో వారి సంక్షేమానికి రూ.రెండువేల కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించిన బాబు ప్రత్యేక డీఎస్సీ మాటేమిటని పదేపదే ప్రశ్నించిన వికలాంగ మహిళను చిరునవ్వే సమాధానంగా నిరాశపరిచారు.అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో విజయవాడలో నిర్వహించాలనుకుని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంపై తనకున్న అభిమానమే కారణమని గొప్పగా చెప్పుకునేందుకు సీఎం ప్రయత్నించారు.
స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ అధికారికంగా నిర్వహించిన ఈ సమావేశాన్ని చంద్రబాబు పొగడ్తల వేదికగా మార్చేయడం వేదికపై అధికారులను విస్మయానికి గురిచేసింది. గుంటూరుకు చెందిన అంధుడైన పీజీ విద్యార్థి సురేష్‌కుమార్ మితిమీరిన అభిమానంతో చేసిన సుదీర్ఘప్రసంగం సభికుల సహనాన్ని పరీక్షించించింది. ‘అందరి రక్తం గ్రూపు ‘ఎ’ పాజిటివ్, ‘బి’ పాజిటివ్ అని వస్తుంది. కానీ నా గ్రూపు ‘టీడీపీ’ అని వస్తుందని, 65 ఏళ్ల మంచి నాయకుడు బాబుకు తాను 25 ఏళ్ల మిసైల్ వంటి యువకుడినంటూ అతిశయోక్తులతో కీర్తిస్తుంటే కట్టడి చేయలేక నిర్వాహకులు దిక్కులు చూడాల్సి వచ్చింది.
ఇక్కట్ల పాలైన వికలాంగులు
సీఎం వస్తున్నారని ఉదయం ఏడుగంటలకే జిల్లా నలుమూలల నుంచి వికలాంగులను సభా ప్రాంగణానికి తరలించిన నిర్వాహకులు వారి అవసరాలను, సమస్యలను విస్మరించడం విమర్శలపాలైంది. వందలాది మందిని సుదూర ప్రాంతాల నుంచి తరలించి వారికి నాలుగు బిస్కెట్లతో సరిపెట్టడం వికలాంగులకు కన్నీరు మిగిల్చింది. పర్యటన ఆద్యంతం పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో వికలాంగులు మొదలుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతల వరకు అడుగడుగునా అందరూ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆర్‌అండ్‌బి అతిథిగృహం వద్ద అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్‌లను, చివరకు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధను సైతం అనుమతించకుండా పోలీసులు అతి చేశారు.
సీఎం పుష్కరఘాట్‌లు, నాలుగో వంతెన, హేవ్‌లాక్ వంతెన, రోడ్‌కం రైలుబ్రిడ్జి, నల్లాచానల్, కోటిలింగాల రేవు...ఇలా అన్ని పరిశీలించి వెళతారన్నా చివరకు నామ్‌కేవాస్తేగా ఒక్క గౌతమఘాట్‌లో మాత్రమే దిగి మరెక్కడా ఆగకుండానే కారులో చూసుకుంటూ వెళ్లిపోయారు. సమయాభావంతో అలా చేయాల్సి వచ్చిందని నేతలు సర్ది చెప్పబోయారు. పనిలో పనిగా ఈ పర్యటనలో చంద్రబాబు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాను టీడీపీలో చేర్చుకున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నా బాబు సమక్షంలో రాజా టీడీపీ తీర్థం పుచ్చుకోగా, ఆ సమయానికి తోట పార్లమెంటు సమావేశాల్లో ఉండటం గమనార్హం. కాగా, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో చంద్రబాబును కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి పొన్నాడ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
పుష్కర నిధులపై నేతలు, అధికారుల పెదవి విరుపు
పుష్కరాలపై పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం నిధులకు ఢోకా లేదంటూనే వాటిపై నిర్దిష్టమైన ప్రకటన చేయకుండా వెళ్లిపోవడం నేతలు, అధికారులకు నిరాశను మిగిల్చింది. పుష్కర పనులకు మొదట రూ.750 కోట్లతో వేసిన అంచనాలను తరువాత రూ.520 కోట్లకు, తిరిగి రూ.260 కోట్లకు కుదించారు. ఆర్థిక మంత్రి యనమల ఇటీవల సమీక్షలో వంద కోట్లకే పరిమితం చేసి తొలి విడతలో రూ.30 కోట్లు విడుదల చేస్తామన్నారు. అప్పుడు యనమల చెప్పిన లెక్క ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు పుష్కర సమీక్షలో రెండు జిల్లాలకూ కలిపి రూ.25 కోట్లకు (తూర్పునకు రూ.15 కోట్లు, పశ్చిమకు రూ.10 కోట్లు) అనుమతించడం ఏ మూలకు సరిపోతాయని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. అన్నవరం సహా పంచారామాల అభివృద్ధిని ప్రతినెలా సమీక్షించాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్‌లు నీతూప్రసాద్, భాస్కర్‌లను సీఎం ఆదేశించారు. రాజమండ్రిలో 24 గంటల విద్యుత్ సరఫరా, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, రూ.10 కోట్లతో రాజమండ్రి జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం వద్ద ఖాళీ స్థలంలో కన్వెన్షన్ సెంటర్, మార్చి నెలాఖరుకు నాలుగో వంతెన పూర్తి, ఏప్రిల్ కల్లా కాకినాడ-రాజమండ్రి కెనాల్ రోడ్డు విస్తరణ పూర్తి వంటి లక్ష్యాలను నిర్దేశించారు.