సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) నిబంధనలకు కొత్త భాష్యం చెబుతూ అనంతపురం-భోగసముద్రం ఫోర్‌లేన్ రోడ్డు పనులను మొత్తం 12 శాతం కమీషన్‌పై ప్రధాన కాంట్రాక్టర్.. సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. ఉత్తి పుణ్యాన రూ.22.21 కోట్లు గుడ్‌విల్‌గా నొక్కేశారు.
తొలుత ఈ పనులపై అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి, మాజీ మంత్రి కన్నేశారు. ఇద్దరి మధ్య పోటీ వల్ల రెండు సార్లు టెండర్లు రద్దయ్యాయి. 2012 ఫిబ్రవరి 29న మూడవ సారి రూ.192.70 కోట్ల అంచనా వ్యయంతో తిరిగి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్లీ గొడవ కావడంతో పంచాయితీ ప్రభుత్వ పెద్ద వద్దకు వెళ్లింది. ఆ పెద్ద వైఎస్సార్ జిల్లాలో తన సమీప బంధువైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి లబ్ధి చేకూర్చాలని భావించారు. రమేష్‌రెడ్డికి చెందిన ఆర్కే కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు దక్కేలా చేసి.. ఆ సంస్థ నుంచి మాజీ మంత్రికి రూ.7.50 కోట్లు, మంత్రికి రూ.3.50 కోట్లు ఇప్పించేలా ఒప్పందం కుదిర్చారు.
టెండర్ ఇలా దక్కింది..
ఆర్కే కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు టెండరు దాఖలు చేసిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ట్రాక్ రికార్డు
సరిగా లేదనే సాకుతో అప్పటి ఎస్‌ఈ వైఆర్ సుబ్రమణ్యం అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ ట్రాక్ రికార్డు కూడా బాగోలేదని బాధిత సంస్థ ఎస్‌ఈకి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన టెండర్ ప్రక్రియను పక్కన పెట్టా రు. ప్రభుత్వ పెద్ద ఆగ్రహంతో సీన్ మారిపోయింది. సుబ్రమణ్యంపై బదిలీ వేటు వేసి ఆయన స్థానంలో వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు. ఆయన 2012 జూలై 18న ప్రైస్‌బిడ్ ను తెరిచి, 3.99 శాతం తక్కువ ధర(రూ.185.10 కోట్ల)కు కోట్ చేసిన ఆర్కే కన్‌స్ట్రక్షన్స్‌కు టెండర్ దక్కేలా చేశారు.
అక్రమాలు ఇలా.. ఈపీసీ నిబంధనల మేరకు ప్రధాన కాంట్రాక్టర్ 50 శాతం పనులను మాత్రమే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. అయితే ప్రభుత్వ పెద్ద అండ చూసుకుని మొత్తం పనులను 12 శాతం కమీషన్‌పై ద్వారకా కన్‌స్ట్రక్షన్స్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. కమీషన్ రూపంలో రూ.22.21 కోట్లు దండుకుని ముందస్తు ఒప్పందం మేరకు మాజీ మంత్రికి రూ.7.50 కోట్లు, మంత్రికి రూ.3.50 కోట్లు వాటాలు పంపిణీ చేసినట్లు సమాచారం. తక్కిన రూ.11.21 కోట్లు ప్రధాన కాంట్రాక్టర్‌కు గిట్టుబాటైంది. దీంతో సబ్‌కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలిచ్చి పనులు చేస్తున్నాడు. కాగా, ఈ విషయంపై ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ వేణుగోపాల్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. సబ్ కాంట్రాక్ట్‌కు ఇచ్చిన విషయం తమకు తెలియదని చెప్పారు.
దర్జాగా రూ.22.21 కోట్ల దోపిడీ!
Published Sat, Jan 25 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement