
ఈ వాచ్ రూ.27 లక్షలు
సాక్షి, తిరుమల: అక్షరాల రూ.27లక్షల విలువైన చేతి గడియారం మంగళవారం మార్కెట్‌లోకి విడుదలైంది. మేలిమి రకానికి చెందిన వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి పూర్తిస్థాయిలో బంగారంతో గడియారాన్ని తయారు చేయటమే ఈ ఖరీదుకు కారణం. గడియారాన్ని స్వర్ణకారులు చేతి నైపుణ్యంతో మాత్రమే సిద్ధం చేశారని బెంగళూరుకు చెందిన రోడియో డ్రైవ్ లగ్జరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ పృథ్వీరాజ్ బగ్రేచ వెల్లడించారు.
సిద్ధం చేసిన వాటిల్లో రెండు గడియారాలను మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఒక్కో గడియారాన్ని 111 గ్రాముల బంగారం, మేలిమి రకానికి చెందిన 13 వజ్రాలు, కెంపులు, పచ్చలతో తయారుచేశారు. గడియారం లోపలి భాగంలో వజ్రాలు పొదిగిన వేంకటేశ్వరస్వామి బంగారు ప్రతిమ ఏర్పాటుచేశారు. వెనుక భాగంలో స్వర్ణకాంతులీనే ఆనంద నిలయం బంగారం ప్రతిమను అమర్చారు. చేతిపట్టీలో ఒకవైపు బంగారంతో లాక్ కూడా అమర్చారు.