
'చివరి అవకాశాన్ని వినియోగించుకోండి'
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.38కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవసరాల కోసం నగదును తరలించేవారు కచ్చితమైన ఆధారాలు చూపాలని స్పష్టం చేశారు. 1,911 ఫ్లయింగ్ స్వాడ్లు పని చేస్తుండగా, 899 చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు భన్వర్లాల్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
రాష్ట్రంలో సాధారణ ఎన్నికల పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఇప్పటివరకూ 34లక్షల బోగస్ ఓట్లను తొలగించామని భన్వర్లాల్ పేర్కొన్నారు. కొత్తగా ఆరు లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశామని, మొత్తం ఓటర్ల సంఖ్య 6కోట్ల 30 లక్షలకు చేరిందన్నారు. ఓటరు నమోదుకు చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని భన్వర్లాల్ సూచించారు.
పోలింగ్ స్టేషన్ వివరాలు ఆన్లైన్లో తెలుసుకునేందుకు జీపీఎస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని భన్వర్లాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా నిర్ణయం రాలేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఈఆర్సీ విజ్ఞప్తిని ఈసీకి పంపినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని భన్వర్‌లాల్ కోరారు.