తుపాను బాధిత జిల్లాలకు జిల్లా నుంచి ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపించినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
ఏలూరు : తుపాను బాధిత జిల్లాలకు జిల్లా నుంచి ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపించినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏలూరు కలెక్టర్ ఛాంబరులో జిల్లా రెవెన్యూ అధికారితో సహాయ కార్యక్రమాలపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాలు కాకుండా 8 టన్నుల కూరగాయలు, 75 వేల కొవ్వొత్తులు జిల్లా నుంచి పంపించామన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను బాధితులకు ప్రభుత్వం చేపట్టిన సహాయక పునరావాస కార్యక్రమంలో వెయ్యి మంది అధికారులు, సిబ్బంది వెళ్లి బాధితులకు సేవలు అందించినట్టు చెప్పారు. జిల్లా నుంచి జేసీ, జెడ్పీ సీఈవో, డీఎస్‌వోలను ఆయా జిల్లాలకు పంపించి వాటిని పర్యవేక్షించి, బాధితులకు సక్రమంగా నిత్యావసరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.
నేడు జిల్లాకు అధికారులు, సిబ్బంది
ఉత్తరాంధ్రలో దాదాపుగా 10 రోజులు పునరావాస కార్యక్రమాల్లో ముందుండి ప్రజలకు సహాయం చేసిన అధికారుల బృందం బుధవారం జిల్లాకు చేరుకోనుందని కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజలు తుపాను బాధిత ప్రజలకు సహాయం అందించటంలో ముందంజలో ఉండి జిల్లా యంత్రాంగానికి ఎంతగానో సహకరించాలని కలెక్టర్ తెలిపారు.