అనుమతి లేనిదే జిల్లాను వదిలి వెళ్లొద్దు
ఏలూరు (మెట్రో): జిల్లాలో అన్ని శాఖల అధికారులు సాధారణ సెలవులు, ప్రభుత్వ సెలవుదినాల్లో అనుమతి తీసుకున్న తర్వాతనే జిల్లా దాటి వెళ్లాలని ఆయా శాఖాధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు స్థానికంగా పనిచేసే ప్రదేశంలో నివాసం ఉండకుండా విజయవాడ, ఇతర ప్రాంతాల నుండి ప్రతి రోజు జిల్లాకు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. జిల్లాలో ఏదైనా అనుకోని ప్రమాద సంఘటన జరిగినప్పుడు సంబంధిత శాఖాధికారులు అందుబాటులో లేకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఆ సమస్యను ఎవరు పరిష్కరిస్తారన్నారు. ఇఆఫీస్‌లో జిల్లా అధికారులు సెలవులు పెట్టి తన అనుమతి లేనిదే వెళ్లకూడదని కలెక్టర్ చెప్పారు. చంద్రన్న బీమా క్లెయిమ్స్ మీద సమీక్షిస్తూ పోలీస్ శాఖ వారి దగ్గర ఎఫ్‌ఐఆర్‌లు 10 పెండింగ్‌లో ఉన్నాయని వాటన్నింటినీ 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. మీ కోసం ద్వారా వచ్చిన, మీ సేవలో వచ్చిన అర్జీలు సెల్ఫీ లేదా వీడియోలో చిత్రీకరించి నమోదు చేయాలని ఆదేశించినా కొన్నిశాఖలు నమోదు చేయడం లేదన్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
నూరు శాతం టీకాలు వేయించాల్సిందే
పొంగు, తట్టు వ్యాధి నిరోధక టీకాలు జిల్లాలో 100శాతం పిల్లలకు వేయించాలని జిల్లా వైద్యాధికారి, ఇమ్యునైజేషన్ అధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 3వ జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలో పల్స్ సర్వే ప్రకారంగా 8లక్షల 36వేల మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ సెప్టెంబరు 8వ తారీకు లోపల వైద్యాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బాధ్యత వహించి అందరికీ తట్టు, పొంగు నివారణ టీకాలు వేయించాలని, వారి వివరాలన్నీ ఆన్‌లైన్ యాప్‌లో నిర్ణయించిన ప్రొఫార్మాలో పొందు పరచాలని ఆదేశించారు. గతంలో చేసిన నిర్లక్ష్యం ప్రస్తుతం చేయొద్దని సూచించారు. టీకాలు వేయించడంలో విద్యాశాఖ, శిశు సంక్షేమశాఖ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ, మైనార్టీ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంటింటా సర్వే నిర్వహించండిః
స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా జిల్లాను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా గుర్తించేందుకు ప్రతి గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకూ నివేదిక సమర్పించకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలను గుర్తించి నివేదికను త్వరితగతిన ఎంపీడీఓలు పంపాలని ఆదేశించారు. జిల్లాకు నూతనంగా వచ్చి నివాసం ఉంటున్న కుటుంబాల వివరాలు సేకరించి వారి గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి:
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించేందుకు స్త్రీశిశు సంక్షేమశాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో స్త్రీశిశు సంక్షేమశాఖ సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెలా 31వ తేదీ నాటికి ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యావతిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, డీఆర్‌ఓ కె.హైమావతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసు, డీఈఓ ఆర్‌ఎస్ గంగాభవాని, డీఎస్‌ఓ షరీఫ్, డీఎం పీ.కొండయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.కోటేశ్వరి జిల్లా అధికారులు పాల్గొన్నారు.