సాక్షి, అమరావతి బ్యూరో:
రూ.5 లక్షలు ఇస్తే సిస్టమ్ మేనేజర్..
రూ.3 లక్షలు ఇస్తే సిస్టమ్ అసిస్టెంట్..
ఆ తర్వాత రెగ్యులర్ అయ్యే అవకాశం..
ఇదీ ఉద్యోగాలిప్పిస్తామంటూ అమరావతిలోని తాత్కాలిక సచివాలయం కేంద్రంగా సాగుతున్న రాకెట్. పురపాలక శాఖలో కీలక నేతకు సన్నిహితుడైన ఓ ప్రైవేటు వ్యక్తి దీనికి రింగ్ మాస్టర్ కాగా ఓ ఉన్నతాధికారి సూత్రధారి. ఇంకేముంది నిరుద్యోగులు నమ్మి దాదాపు రూ.4 కోట్లు ముట్టజెప్పారు.
పురపాలక శాఖలో తిష్ట వేసి..
రాజధాని వ్యవహారాలు చూసే ప్రభుత్వ నేతకు సన్నిహితుడైన ఆ ప్రైవేటు వ్యక్తి పురపాలక శాఖలో చక్రం తిప్పుతున్నాడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, హనుమాన్‌జంక్షన్‌కు చెందిన ఆయన కొన్నేళ్లుగా విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఉంటున్నాడు. పురపాలక శాఖలో అనధికారికంగా తిష్టవేసి ఆ శాఖలో ఓ ఉన్నతాధికారితో సాన్నిహిత్యం పెంచుకుని దందాలకు తెరతీశాడు. కాగా, సెక్రటేరియట్, సీఆర్డీఏ, పురపాలక సంఘాల్లో 110 సిస్టమ్ మేనేజర్లు, 128 సిస్టమ్ అసిస్టెంట్ల పోస్టులను కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఇదే అదనుగా ఆ వ్యక్తి చక్రం తిప్పాడు.
రూ.4 కోట్లు వసూలు: పురపాలక శాఖలో కీలక నేతకు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆ వ్యక్తి అభ్యర్థులకు చెప్పుకొచ్చాడు. సిస్టమ్ మేనేజర్ పోస్టుకు రూ.5 లక్షలు, సిస్టమ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.3 లక్షలు చొప్పున బేరం పెట్టాడు. ఆ పోస్టులను తర్వాత రెగ్యులర్ కూడా చేస్తారని ఆశ చూపించాడు. ఆయన మాటలను ఆ ఉన్నతాధికారి కూడా సమర్థించినట్లు సమాచారం. దీంతో దాదాపు 100 మంది అభ్యర్థులు ఆయన అడిగినంత ముట్టజెప్పారు. ఇలా గతేడాది నవంబర్, డిసెంబర్‌లలో దాదాపు రూ.4 కోట్లకుపైగా వసూలు చేశాడు. నిరుద్యోగులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పురపాలక శాఖకు పంపించారు. దరఖాస్తులు స్వీకరించినట్టు ఆ శాఖ కూడా నిర్ధారించింది. అప్పటి నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వస్తుందంటూ జాప్యం చేస్తూ వచ్చాడు. కానీ ఇంటర్వ్యూకు పిలుపు రాలేదు. అభ్యర్థులు ఆరేడు నెలల నుంచి ఆయన చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది.
రింగ్ మాస్టర్‌కు అధికారుల వత్తాసు
రూ.4 కోట్లు సమర్పించిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించారు. ఈ విషయంపై పురపాలక శాఖ మంత్రిత్వ శాఖకు కూడా వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అందరూ ఓ వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి న్యాయం కోసం ఒత్తిడి పెంచారు. అయినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కీలక నేతకు సన్నిహితుడైన రింగ్ మాస్టర్‌ను వెనకేసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ నిరుద్యోగి మూడు రోజుల క్రితం హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కీలక నేతకు సన్నిహితుడు కావడంతో చర్యలు తీసుకునేందుకు పోలీసుల సందేహిస్తున్నారు. మరోవైపు ఆ రింగ్ మాస్టర్ కుటుంబసభ్యులు నిరుద్యోగులపై ఎదురు కేసులు పెడతామని బెదిరిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment