- పెరిగిన వ్యయానికి బోర్డు ఆమోదం
- దిగుమతి కోల్‌పై సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) ప్రాజెక్టు వ్యయం మరో రూ. 40 కోట్లు పెరిగింది. పెరిగిన వ్యయానికి మంగళవారం జరిగిన కృష్ణపట్నం పాలక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ జెన్‌కో ఎండీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. 1600 మెగావాట్లతో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ. 8,500 కోట్లు. ఆ తర్వాత దీన్ని రూ. వెయ్యి కోట్లకు పెంచారు. తాజా పెరుగుదలతో నిర్మాణ వ్యయం రూ. 9,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు వ్యయం మెగావాట్‌కు 5.95 కోట్లకు చేరింది.
పూర్తయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల మేరకు మెగావాట్ రూ. 5.5 కోట్లే ఉండాల్సి ఉన్నా, దీనిపై సమగ్ర వివరాలతో సీఈఏను ఒప్పించాలని నిర్ణయించారు. కృష్ణపట్నం రెండో దశ వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)పై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విదేశీ బొగ్గును ఢిల్లీకి చెందిన ఎంఎంటీసీ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కోల్ ఇండియా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత ధరకు అందిస్తాడనే అంశాలపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
మీ వాటా మీకిస్తాం... ప్రాజెక్టు వదిలేయండి
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ వాటా అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కూడా చేయడం లేదు. భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణపట్నం నిర్మాణ వ్యయంలో తెలంగాణ వాటా ఇస్తామని, ప్రాజెక్టును ఏపీ పరం చేయాలని ఏపీ జెన్‌కో ఎండీ సూచించినట్టు తెలిసింది. అయితే, దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని తెలంగాణ అధికారులు అన్నట్టు సమాచారం.
రూ.40 కోట్లు పెరిగిన కృష్ణపట్నం వ్యయం
Published Tue, Jun 30 2015 11:34 PM | Last Updated on Thu, Oct 4 2018 6:53 PM
Advertisement
Advertisement