రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత | Rs 50 lakh worth of cannabis Capture | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Published Wed, Oct 2 2013 3:18 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Rs 50 lakh worth of cannabis Capture

పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల నుంచి తమిళనాడుకు భారీ స్థాయిలో రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సయిజ్ శాఖాధికారులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. పాడేరు-పెదబయలు రోడ్డులోని గంపరాయి సమీపంలోని వంతెన వద్ద గంజాయితో వెళ్తున్న వ్యాన్‌ను గుర్తించిన ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నాగేంద్రలు తమ సిబ్బందితో మెరుపుదాడి చేశారు. వ్యాన్‌లో ఎవరికీ అనుమానం రాకుండా అమర్చిన 250 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 500 కిలోల బరువున్న గంజాయి విలువ రూ.50 లక్షలుంటుందని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పాడేరుకు చెందిన కొర్రా గణేష్, రాజాపురం గ్రామానికి చెందిన గెమ్మెలి రవికుమార్, కొర్రా మహేష్, కూడా పోతురాజులను అరెస్టు చేశామన్నారు. పరారైన జి.మాడుగుల మండలానికి చెందిన శేఖర్‌పై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. జి.మాడుగుల, పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతం నుంచి పెదబయలు మీదుగా విశాఖపట్నం వరకు గంజాయిని తరలిస్తున్నారని, అక్కడి నుంచి చెన్నై ప్రాంతానికి తరలిస్తారని పేర్కొన్నారు. వ్యాన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఈ ఏడాది ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి తోట లను కూడా ధ్వంసం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. దాడు ల్లో అనకాపల్లి ఎక్సయిజ్ సూపరింటెం డెంట్ మూర్తి, పాడేరు పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు, మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.  
 
 కాలినడకన తరలిస్తుండగా పట్టివేత
 ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు కాలినడకన గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు తమిళనాడు వ్యాపారస్తులను సోమవారం సాయంత్రం పాడేరు ఘాట్‌లోని అమ్మవారి పాదాలు వద్ద అరెస్టు చేశామని పాడేరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. తమిళనాడుకు చెందిన పేరిరాజు, పడిత్రేయిల నుంచి పది కిలోల గంజాయి, రూ.20 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement