కర్నూలు (హాస్పిటల్): 2025 నాటికి ఎండ్ టీబీ స్టాటజీ ప్రోగ్రామ్‌లో భాగంగా మందులతో పాటు ప్రతి క్షయ రోగికి రూ.500 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా క్షయ నివారణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 2003 నుంచి ఇప్పటి వరకు 91,154 మంది టీబీ రోగులకు చికిత్స అందించామన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీతోపాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో టీబీ న్యాట్ మిషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ మిషన్‌తో ఇతర వైద్యపరీక్షల్లో బయటపడని టీబీ జబ్బు కూడా బయటపడుతుందన్నారు. ఇదే యంత్రం ద్వారా యూనివర్శల్ డ్రగ్ సెన్సిటివిటి టెస్ట్ కూడా చేస్తున్నామన్నారు. టీబీ రోగులకు ఏ మందులు పడతాయో, ఏవీ పడవో గుర్తించి చికిత్స చేసేందుకు ఈ పరీక్ష ద్వారా సులభమవుతుందని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా ఉచితంగా మందులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment