అక్రమాలపై ‘రివర్స్‌’ | Rs 680 Crore Tenders Cancelled In Chittoor | Sakshi
Sakshi News home page

అక్రమాలపై ‘రివర్స్‌’

Published Fri, Sep 27 2019 10:40 AM | Last Updated on Fri, Sep 27 2019 10:40 AM

Rs 680 Crore Tenders Cancelled In Chittoor - Sakshi

ప్రజాధనాన్ని కాపాడడమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వారి అనుచరులకు అడ్డంగా దోచిపెట్టిన టెండర్లు ఒక్కొక్కటీ రద్దు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలో రూ.680 కోట్ల విలువైన నాలుగు పనులకు సంబంధించిన టెండర్లు రద్దయ్యాయి. ఇందులో జరిగిన అక్రమాలు, పనుల మందకొడితనాన్ని పరిగణనలోకి తీసుకుని వీటిని రద్దు చేశారు. వీటికి మళ్లీ టెండర్లు నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలపై నేడు చర్చలు సాగించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

సాక్షి, తిరుపతి అర్బన్‌: జిల్లాలోని రైతులకు బంగారు భవితను అందించడానికి నూతన ప్రభుత్వం శతవిధాలా కృషిచేస్తోంది. ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే రైతులు లక్షల హెక్టార్లకు చెందిన బీడు భూములను సాగులోకి తీసుకురావాలనే సంకల్పంతో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులకు చెందిన పూర్తి సమాచారాన్ని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. 2006లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాలో 3.75లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తద్వారా 7లక్షల మంది రైతులకు ప్రత్యేకంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నారు.

గత టీడీపీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా తమవారికి అధిక ధరలకు కాంట్రాక్ట్‌ పనులు కట్టబెట్టింది. ఆ పనులకు సంబంధించిన వాస్తవాలను నిగ్గుతేల్చడంతోపాటు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రూ.680 కోట్ల టెండర్లు రద్దు చేసింది. విజయవాడలో శుక్రవారం సంబంధిత ప్రాజెక్టులపై మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాంట్రాక్టర్లకు నోటీసులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలోని అలూర్తుపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు, ఆల్తూరుపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రిజర్వాయర్‌కు రూ.280 కోట్లు, చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామ సమీపంలోని మేర్లపాక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూ.250 కోట్లు, చంద్రగిరి సమీపంలోని మూలకాలువ వద్ద చేపడుతున్న హంద్రీ–నీవా పనులకు రూ.40కోట్లతో గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వీటిని దక్కించుకున్న సంబంధిత కాంట్రాక్టర్లు ఇప్పటివరకు 25 శాతం కన్నా తక్కువ పనిచేసినట్లు ఇటీవల నిపుణుల కమిటీ తేల్చింది. దీనికితోడు ఐబీఎం (ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌) నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు గుర్తించింది  నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించారు. ఆ పనులు రద్దు చేస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్లకు నోటీలు అందజేశారు. ఈ నాలుగు పనులకు అవసరాన్ని బట్టి రివర్స్‌ టెండర్లు చేపట్టనున్నారు.

నేడు వీటిపైనే ప్రధాన చర్చ
► విజయవాడలో శుక్రవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో జిల్లాకు చెందిన పలు ప్రాజెక్టులు, టెండర్లపై చర్చించనున్నారు.
► చిత్తూరు జిల్లాలో రద్దుచేసిన నాలుగు టెండర్లు వ్యవహారం
► జిల్లాలో బాలాజీ రిజర్వాయర్‌ నీటిని తిరుమలకు ఏ పద్ధతిలో పంపాలనే అంశం
► మల్లిమడుగు, వేణుగోపాలసాగర్‌ రిజర్వాయర్లు అటవీ అడ్డంకులు
► హంద్రీ–నీవా సుజల స్రవంతి పనుల్లో తీవ్రమైన జాప్యం
► గాలేరు–నగరి సుజల స్రవంతికి చెందిన 7 ప్యాకేజీల పనుల్లో ఆలస్యం
► వాటర్‌ గ్రాండ్‌ పథకం ద్వారా ఆయా ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు తాగునీరు ఇవ్వడం

సోమశిల–స్వర్ణముఖి శుద్ధమోసం


సోమశిల–స్వర్ణముఖి కాలువ

2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోమశిల–స్వర్ణముఖి పేరుతో 101 కి.మీ మేరకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల్లో సాగునీరు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. ఈ కాలువ పూర్తి చేయడానికి 6,225 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 1.23లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. టీడీపీ హ యాంలో సోమశిల–స్వర్ణముఖి కాలువ పేరును ఆల్తూరుపాడు–మేర్లపాకగా మార్పు చేయడంతోపాటు 101 కి.మీ నుంచి 48 కి.మీ కాలువను కుదించారు. కేవలం 1,546 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారు. 101 కి.మీ పనులకు అప్పట్లో రూ.362 కోట్లు కేటాయింపులు చేశారు. చంద్రబాబు సర్కార్‌ 48 కి.మీ రూ.421కోట్లు అంచనా వేశారు. తమ అనుచరులకు 60సీ క్లాజ్‌ పేరుతో పెద్ద ఎత్తున దోచిపెట్టినట్టు స్పష్టమవుతోంది.

టెండర్ల రద్దు వాస్తవమే 
చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఆల్తూరుపాడుకు చెందిన రెండు టెండర్లు, మేర్లపాక టెండర్, మూలకాలువ టెండర్‌ను రద్దు చేశాం. సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు పంపించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేకపోవడమే ప్రధాన కారణం. శుక్రవారం విజయవాడలో మంత్రుల నేతృత్వంలో ప్రాజెక్టులపై జలవనరులశాఖ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ప్రతి ప్రాజెక్టును పారదర్శకంగా పూర్తిచేయాలనే చిత్తుశుద్ధితో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆమేరకు కాంట్రాక్టర్లు నడుచుకోవాలి.
–మురళీనాథరెడ్డి, చీఫ్‌ ఇంజినీర్, జలవనరులశాఖ, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement