కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ సొమ్మును అధికారులు, సిబ్బందే కాజేస్తున్నారు. ఎట్టకేలకు పలువురి పాపం పండటంతో క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధమైంది. రూ.లక్షకు పైబడి నిధులు బొక్కిన వారిపై సత్వరం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మూడు రోజుల క్రితమే జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నుంచి పింఛన్ల అక్రమార్కులపై క్రిమినల్ కేసుల నమోదుకు సంబంధిత స్టేషన్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని యాక్సిస్ బ్యాంకు, ఫినో కంపెనీలు సంయుక్తంగా చేపడుతున్నాయి.
పింఛన్లకు సంబంధించిన నిధులను ప్రభుత్వం డీఆర్‌డీఏ-ఐకేపీకి విడుదల చేస్తుండగా.. ఆ తర్వాత వారు యాక్సిస్ బ్యాంకుకు బదలాయిస్తున్నారు. అక్కడి నుంచి నిధులు ఫినో కంపెనీకి చెందిన మండల కో-ఆర్డినేటర్లకు, అక్కడి నుంచి గ్రామస్థాయిలోని కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్తోంది. ఇందులో అధిక శాతం సీఎస్పీలు, మండల కో-ఆర్డినేటర్లు స్వాహా చేస్తున్నారు. సామాజిక తనిఖీల ద్వారా ఇప్పటి వరకు పింఛన్ల మొత్తం రూ.83 లక్షలు మింగేశారు. ఎవరైన పింఛన్‌దారు చనిపోతే ఆ సమాచారాన్ని వెంటనే ఎంపీడీఓ ద్వారా సెర్ఫ్‌కు చేరవేయాలి. వారు దానిని రద్దు చేసి మరొకరికి మంజూరు చేస్తారు.
అయితే సీఎస్‌పీలు పింఛన్‌దారులు చనిపోతే పైకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫోర్జరీ సంతకాలతో దిగమింగుతున్నారు. అదేవిధంగా వలస వెళ్లిన వారి పింఛన్లనూ స్వాహా చేస్తున్నారు. పేర్లలో తప్పులు ఉన్నాయనే సాకుతో పింఛన్లు ఇవ్వకుండా కాజేస్తున్నారు. సీఎస్‌పీలు పంపిణీ చేయగా మిగిలిన మొత్తాన్ని మండల కో-ఆర్డినేటర్లకు అప్పగిస్తారు. అక్కడా ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేసేస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు, ఫినో కంపెనీలకు ముందు పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. సామాజిక తనిఖీల్లో ఇప్పటి వరకు 638 మంది రూ.83 లక్షలు స్వాహా చేసినట్లు నిర్ధారించారు. ఇందులో ఇప్పటికే ఆత్మకూరు, మద్దికెర మండలాల్లో పింఛన్లు స్వాహా చేసిన సీఎస్‌పీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, తాజాగా 12 మందిపై క్రిమినల్ చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన వారిపై చర్యలతో పాటు రికవరీ కూడా ఉంటుందని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
రూ.83 లక్షలు స్వాహా
Published Thu, Feb 6 2014 3:22 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement