రూ.కోట్లలో వాణిజ్యం
వసూలు కాని పన్నులు
లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న అధికారులు
వ్యాపారులతో రహస్య ఒప్పందాలు?
విశాఖపట్నం : ఆర్థిక రాజధాని విశాఖలో వర్తక, వాణిజ్యం ఊపందుకుంది. అయితే ఆ మేరకు పన్నులు వసూలు చేయడంలో మాత్రం వాణిజ్య పన్నుల శాఖ విఫలమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ చేరుకోలేకపోయింది. చెక్‌పోస్టులు లేకపోవడం, వాణిజ్యవేత్తలతో లాలూచీ పడడం వంటి కారణాలతో ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ.2035.20 కోట్లు. కానీ విశాఖ డివిజన్ పరిధిలో రూ.1616.10కోట్లే వసూలు చేశారు. అన్ని సర్కిళ్లలోనూ కలిపి 79 శాతం ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి విశాఖ డివిజన్ పరిధిలో భారీ పరిశ్రమలున్నాయి. అయినా ఆదాయం మాత్రం ఆ మేరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. పన్ను వసూళ్లు, ఆదాయార్జనలో విశాఖ డివిజన్ రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు డివిజన్ మొత్తం మీద 285 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
రహస్య ఒప్పందాలు?
పన్ను ఎగవేత దారులతో అధికారులు రహస్య ఒప్పందాలు చేసుకుని, వారికి అన్ని విధాల సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ శాఖ అధికారులు కొంతమంది అవినీతి నిరోధక శాఖకు చిక్కడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అక్కడే వాణిజ్యశాఖ సిబ్బంది తనిఖీలు చేసి పన్ను ఎగవేత దారులపై జరిమానా విధిస్తుంటారు. కానీ జిల్లా సరిహద్దుల్లో అలాంటి ఏర్పాట్లేవీ లేకపోవడంతో పన్ను చెల్లించకుండానే సరకు రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇలాంటి వాటిపై అడపా దడపా దాడులు చేయగా గతేడాది రూ.120 కోట్లు జరిమానా కింద వసూలైంది. అలాంటిది పూర్తి స్థాయిలో చెక్‌పోస్టులుంటే ఆదాయం మరింత పెరుగుతుందనేది ఎవరికీ తెలియనది కాదు. అయినా ఆదాయార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది.