Economic capital
-
ముంబైని మించిన ఢిల్లీ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధానిగా పేర్గాంచిన ముంబై స్థానాన్ని త్వరలోనే ఢిల్లీ ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ జారీ చేసిన 2015 డేటా ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద 50 ఆర్థిక నగరాల జాబితాలో ఢిల్లీకి 30, ముంబైకి 31వ స్థానం లభించాయి. గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్ వంటి నగరాలతో కలిపి ఢిల్లీ– ఎన్సీఆర్ జీడీపీ 370 వందల కోట్ల డాలర్లు (రూ.25,164,00 కోట్లు) అని నివేదిక పేర్కొంది. ముంబై, నవీ ముంబై, థానే, వసై, వీరార్, భీవండి, పన్వేల్ ప్రాంతాలతో కూడిన ముంబై మెట్రోపాలిటన్ నగరం జీడీపీ 368 వందల డాలర్లని తెలిపింది. 2030 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద నగరాల జాబితాలో ఢిల్లీ 11, ముంబై 14వ స్థానంలో ఉంటాయని వెల్లడించింది. -
సం‘పన్నులు’ కరువు!
రూ.కోట్లలో వాణిజ్యం వసూలు కాని పన్నులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న అధికారులు వ్యాపారులతో రహస్య ఒప్పందాలు? విశాఖపట్నం : ఆర్థిక రాజధాని విశాఖలో వర్తక, వాణిజ్యం ఊపందుకుంది. అయితే ఆ మేరకు పన్నులు వసూలు చేయడంలో మాత్రం వాణిజ్య పన్నుల శాఖ విఫలమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ చేరుకోలేకపోయింది. చెక్‌పోస్టులు లేకపోవడం, వాణిజ్యవేత్తలతో లాలూచీ పడడం వంటి కారణాలతో ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం రూ.2035.20 కోట్లు. కానీ విశాఖ డివిజన్ పరిధిలో రూ.1616.10కోట్లే వసూలు చేశారు. అన్ని సర్కిళ్లలోనూ కలిపి 79 శాతం ఆదాయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి విశాఖ డివిజన్ పరిధిలో భారీ పరిశ్రమలున్నాయి. అయినా ఆదాయం మాత్రం ఆ మేరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. పన్ను వసూళ్లు, ఆదాయార్జనలో విశాఖ డివిజన్ రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ శాఖలో ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు డివిజన్ మొత్తం మీద 285 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రహస్య ఒప్పందాలు? పన్ను ఎగవేత దారులతో అధికారులు రహస్య ఒప్పందాలు చేసుకుని, వారికి అన్ని విధాల సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ శాఖ అధికారులు కొంతమంది అవినీతి నిరోధక శాఖకు చిక్కడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అక్కడే వాణిజ్యశాఖ సిబ్బంది తనిఖీలు చేసి పన్ను ఎగవేత దారులపై జరిమానా విధిస్తుంటారు. కానీ జిల్లా సరిహద్దుల్లో అలాంటి ఏర్పాట్లేవీ లేకపోవడంతో పన్ను చెల్లించకుండానే సరకు రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇలాంటి వాటిపై అడపా దడపా దాడులు చేయగా గతేడాది రూ.120 కోట్లు జరిమానా కింద వసూలైంది. అలాంటిది పూర్తి స్థాయిలో చెక్‌పోస్టులుంటే ఆదాయం మరింత పెరుగుతుందనేది ఎవరికీ తెలియనది కాదు. అయినా ఆదాయార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోతోంది. -
దిగొచ్చిన ధరలు
సాక్షి, ముంబై: వర్షపాతం, సరఫరాలు పెరగడంతో ఆర్థిక రాజధానివ్యాప్తంగా కూరగాయల ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే గురువారం ఒక్క రోజే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్‌కు చేరుకున్నాయి. దీంతో కొన్ని కూరగాయల ధరలు శుక్రవారం నుంచి గణనీయంగా తగ్గిపోయాయి. చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూరగాయల సరఫరాలు గతవారం నుంచి పెరిగాయి. దీంతో కొండెక్కిన కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి. క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ల ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా తగ్గాయని టోకు మార్కెట్ల వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్లోకి నాసిక్, పుణే నుంచి కూరగాయలు గణనీయంగా సరఫరా అయ్యాయి. ఇదిలా ఉండగా ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు కురవడం తగ్గిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా త్వరలోనే కూరగాయల ధరల పెరుగుదలకు అవకాశం ఉంటుందని ఏపీఎంసీ సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు. ముంబైలో మాత్రం ఈ ధోరణి ఉండకపోవచ్చని పలువురు వ్యాపారులు వాదించారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఇదే మాదిరిగా కూరగాయలు రాష్ట్రానికి సరఫరా అయితే వచ్చే వారంలోనూ కూరగాయల ధరలను వాషిలోని ఏపీఎంసీ మార్కెట్ వ్యాపారస్తులు తగ్గించనున్నారు. కూరగాయల వ్యాపారులు అందజేసిన వివరాల మేరకు.. పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ రేట్లు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోయాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ కూరగాయలు గురువారం భారీగా సరఫరా కావడంతోనే వీటి ధరలు తగ్గినట్లు అధికారి ఒకరు తెలిపారు. గతంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో మార్కెట్లో చాలా తక్కువగా కూరగాయలు సరఫరా అయ్యాయి. మరాఠ్వాడా రీజియన్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈసారి అనుకున్నంత మేర వర్షం కురవలేదు. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడిందని ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్లోకి పుణే, నాసిక్ రీజియన్ల నుంచి కూరగాయలు గణనీయంగా దిగుమతి అయ్యాయి. దీంతో కూరగాయల ధరలు కూడా దిగి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు తిరిగి పుంజుకోవడంతో వచ్చే వారంలో కూడా పెరిగిన మరిన్ని కూరగాయల ధరలు కూడా దిగి వస్తాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజు మాత్రమే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్లో దిగుమతి అయ్యాయి. ఉల్లిపాయల ధరలు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయని మరో వ్యాపారి తెలిపారు. టమాటాల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలిపారు.