దిగొచ్చిన ధరలు
సాక్షి, ముంబై: వర్షపాతం, సరఫరాలు పెరగడంతో ఆర్థిక రాజధానివ్యాప్తంగా కూరగాయల ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే గురువారం ఒక్క రోజే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్‌కు చేరుకున్నాయి. దీంతో కొన్ని కూరగాయల ధరలు శుక్రవారం నుంచి గణనీయంగా తగ్గిపోయాయి. చుట్టుపక్కల రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూరగాయల సరఫరాలు గతవారం నుంచి పెరిగాయి. దీంతో కొండెక్కిన కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి.
క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ల ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా తగ్గాయని టోకు మార్కెట్ల వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్‌లోకి నాసిక్, పుణే నుంచి కూరగాయలు గణనీయంగా సరఫరా అయ్యాయి. ఇదిలా ఉండగా ఉత్తర, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు కురవడం తగ్గిపోయింది. ఫలితంగా దేశవ్యాప్తంగా త్వరలోనే కూరగాయల ధరల పెరుగుదలకు అవకాశం ఉంటుందని ఏపీఎంసీ సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు. ముంబైలో మాత్రం ఈ ధోరణి ఉండకపోవచ్చని పలువురు వ్యాపారులు వాదించారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఇదే మాదిరిగా కూరగాయలు రాష్ట్రానికి సరఫరా అయితే వచ్చే వారంలోనూ కూరగాయల ధరలను వాషిలోని ఏపీఎంసీ మార్కెట్ వ్యాపారస్తులు తగ్గించనున్నారు.
కూరగాయల వ్యాపారులు అందజేసిన వివరాల మేరకు.. పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, బీన్స్, కాలిఫ్లవర్ రేట్లు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోయాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఈ కూరగాయలు గురువారం భారీగా సరఫరా కావడంతోనే వీటి ధరలు తగ్గినట్లు అధికారి ఒకరు తెలిపారు. గతంలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో మార్కెట్‌లో చాలా తక్కువగా కూరగాయలు సరఫరా అయ్యాయి. మరాఠ్వాడా రీజియన్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈసారి అనుకున్నంత మేర వర్షం కురవలేదు. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడిందని ఏపీఎంసీ మార్కెట్‌లోని వ్యాపారి శ్రీధర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఏపీఎంసీ మార్కెట్‌లోకి పుణే, నాసిక్ రీజియన్ల నుంచి కూరగాయలు గణనీయంగా దిగుమతి అయ్యాయి. దీంతో కూరగాయల ధరలు కూడా దిగి వచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు తిరిగి పుంజుకోవడంతో వచ్చే వారంలో కూడా పెరిగిన మరిన్ని కూరగాయల ధరలు కూడా దిగి వస్తాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజు మాత్రమే 500 ట్రక్కుల కూరగాయలు వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌లో దిగుమతి అయ్యాయి. ఉల్లిపాయల ధరలు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయని మరో వ్యాపారి తెలిపారు. టమాటాల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలిపారు.