హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి | RSS Meeting In Manthralayam Kurnool | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

Published Sat, Sep 1 2018 8:47 AM | Last Updated on Sat, Sep 1 2018 8:47 AM

RSS Meeting In Manthralayam Kurnool - Sakshi

సమావేశ ప్రారంభానికి విచ్చేస్తున్న పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు

మంత్రాలయం: హిందూ సమాజ జాగరణ, హిందూ ధర్మ పరిరక్షణ ప్రతిష్టాపన కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పిలుపునిచ్చారు.ఇతర దేశాల కంటే భారతదేశం ఎంతో శ్రేష్టమైందని కొనియాడారు. సాధు సంతులు, జగద్గురులు, మహానుభావుల పవిత్ర కార్యక్షేత్రంగా అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతావనిలోనే ఉందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శుక్రవారం మంత్రాలయంలో ప్రారంభమయ్యాయి. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నేతృత్వంలో ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వన చేసి సమావేశాలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్‌ నరేంద్ర హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ 36 సంఘ్‌ పరివార్‌లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు దాదాపు 202 మంది పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయమన్నారు. పవిత్ర తుంగభద్ర నదీతీరంలో మొట్టమొదటిసారిగా  ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. 

సమాజ క్షేత్రాలపై చర్చ  
ఎంతో రహస్యంగా సాగుతున్న సమావేశాల్లో భారతదేశంలోని వివిధ సమాజ క్షేత్రాలపై ప్రధాన చర్చ కొనసాగుతున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్‌వీబీ వసతి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్తమాన సామాజిక స్థితిగతులు, ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, జల సంరక్షణ అంశాలపై మేధో మథనం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం వంటివి ఉండవన్నారు. కేవలం సామాజిక మార్పులపై చర్చించి, భవిష్యత్తు ప్రణాళికలకు రూపకల్పన చేస్తారన్నారు. కాగా..

అమిత్‌ కూడా ఓ సాధారణ కార్యకర్తే!
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా పాత్ర అమోఘమైనది. పార్టీకి మూలస్తంభంగా ఉన్న ఆయన ఎక్కడికి వెళ్లినా  జెడ్‌ కేటగిరి స్థాయి భద్రత ఉంటుంది. అలాంటి నేత ఓ సామాన్య కార్యకర్త లాగా దర్శనమిచ్చారు. సమావేశాల్లో వేదికపై కాకుండా పాఠాలు నేర్చుకునే విద్యార్థిలా స్టేజీకి బహుముఖంగా కూర్చున్నారు. చర్చలో మేధావుల ప్రసంగాలు వింటూ సాధారణ వ్యక్తిగా నడుచుకోవడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. సమావేశ విరామ సమయంలోనూ ఓ కుర్చీపై అలా సేద తీరుతూ.. తేనీరు తీసుకుంటూ కనిపించారు. ఎక్కడా తన హోదాను ప్రదర్శించకుండా ఓ సామాన్యుడిగా అమిత్‌షా కన్పించడం అందరినీ ఆకట్టుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ క్రమశిక్షణ పద్ధతులను జవదాటకుండా నడుచుకోవడం నిజంగా గొప్ప విషయమని స్థానికులు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏపీ ప్రచార ప్రముఖ్‌ భరత్‌ కుమార్,  వివిధ రాష్ట్రాల ప్రచార ప్రముఖ్‌లు, శ్రీమఠం మనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, జోనల్‌ శ్రీపతిఆచార్, ద్వారపాలక అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement