manthralayam
-
వాస్తు దోషం.. ఆ చాంబర్ నాకొద్దు: డిప్యూటీ సీఎం
సాక్షి, ముంబై : మంత్రాలయ భవనంలో ఆరో అంతస్తులో ఉన్న 602 నంబరు చాంబర్ గత ప్రభుత్వానికి అచ్చిరాకపోవడంతో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అజిత్ పవార్ అందులో ఆసీనులయ్యేందుకు జంకుతున్నారు. ఆ చాంబర్‌కు బదులుగా మరో చాంబర్ కావాలని అధికారులను కోరినట్లు తెలిసింది. మంత్రాలయలోని 602 నంబరు చాంబర్లో ఇదివరకు రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి ఆసీనులయ్యారు. కానీ, వీరిలో ఎవ్వరు కూడా ఎక్కువ కాలం మంత్రులుగా కొనసాగలేకపోయారు. దీంతో గత సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ అందులో ఆసీనులయ్యేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఆరో అంతుస్తులో ఉన్న 602 చాంబర్‌కు బదులుగా సామాన్య పరిపాలన విభాగం అప్పర్ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే చాంబర్‌ను ఇష్టపడుతున్నారు. దీంతో సీతారాం కుంటేను ఆ చాంబర్ నుంచి ఖాళీ చేయించి మరో చాంబర్‌కు తరలించే ప్రయత్నం చేయనున్నారు. అందులో అజిత్ పవార్ ఆసీనులయ్యేందుకు వీలుగా క్యాబిన్‌ను తీర్చిదిద్దనున్నారు. ఆ రెండే కీలకం.. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించిన మంత్రులందరు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తంతు పూర్తికాగానే మంత్రాలయ భవనంలో ఏ మంత్రికి, ఏ చాంబర్ లేదా క్యాబిన్ కట్టబెట్టాలనే దానిపై కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆరో అంతస్తులో కీలకమైన ఇద్దరు మంత్రులు అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్లున్నాయి. కాగా మంత్రాలయలో ఉన్న వివిధ మంత్రుల చాంబర్లతో పోలిస్తే ఈ రెండు చాంబర్లు చాలా విశాలంగా, ఆధునిక అలంకరణతో ఉన్నాయి. కాని 602 చాంబర్‌ను స్వీకరించేందుకు అజిత్ పవార్ నిరాకరించారు. ఇదివరకు కొనసాగిన బీజేపీ–శివసేన కాషాయ కూటమి ప్రభుత్వం హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. దీంతో ఈ చాంబర్లో సీతారాం కుంటే ఆసీనులయ్యారు. కాని మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కొత్తగా ఏర్పాటు చేశారు. పొత్తుకు ముందు జరిగిన పదవుల ఒప్పందంలో ముఖ్యమంత్రి పదవి శివసేన, ఉప ముఖ్య మంత్రి పదవి ఎన్సీపీ వాటాలోకి వచ్చింది. ఆ ప్రకారం ఎన్సీపీకి చెందిన అజీత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నియమాల ప్రకారం పవార్ 602 చాంబర్లో అజీత్ పవార్ ఆసీనులు కావాలి. కాని ఆ చాంబర్లో మంత్రులుగా, అధికారులు ఆసీనులైన వారు ఎక్కువ కాలం కొనసాగినలేకపోయారు. దీంతో అజీత్ పవార్ ఆ చాంబర్ తనకు అచ్చిరాకపోవచ్చని భావించి దాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదమూ తప్పలేదు.. 2012లో మంత్రాలయలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు, ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రితోపాటు ఇతర శాఖ చాంబర్లు పూర్తిగా కాలిపోయాయి. అందులో ఉప ముఖ్యమంత్రి చాంబర్ (602) కూడా ఉంది. ఈ ఘటనలో నలుగురు మంత్రాలయ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఆ తరువాత రినోవేషన్ పనులు పూర్తయిన తరువాత ఈ చాంబర్లో ఏక్నాథ్ ఖడ్సే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే భూ స్కాంలో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోవల్సి వచ్చింది. ఆ తరువాత ఈ చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి భావుసాహెబ్ ఫుండ్కర్ పదవీ బాధ్యతలు కొనసాగించారు. కాని దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే ఆయన మృతి చెందారు. ఆ తరువాత ఖాళీ అయిన ఈ చాంబర్లో బీజేపీ ప్రభుత్వం హాయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అనీల్ బోర్డే పదవీ బాధ్యతలు కొనసాగించారు. ఆ తరువాత కొద్ది నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోర్డే పరాజయం పాలయ్యారు. వీటన్నింటిని బట్టి ఈ చాంబర్ అచ్చిరావడం లేదని స్పష్టమవుతోంది. ఈ విషయం అజిత్ పవార్ చెవిన పడటంతో తిరస్కరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై అజిత్ పవార్ అలాంటిదేమి లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్ల మధ్య సామాన్య పరిపాలన విభాగం అప్పర్ ప్రధాన కార్యదర్శి చాంబర్ ఉంటే పనులు పారదర్శకంగా జరుగుతాయి. వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చే బాధితులకు, రైతులకు ఒకేచోట పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. -
మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో?
సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయాన్ని జిల్లా కేంద్రమైన కర్నూలుతో అనుసంధానం చేస్తూ ప్రతిపాదించిన మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల ప్రజల వ్యాపార–వాణిజ్య రంగాల్లో వృద్ధి చెందేందుకు ఉద్దేశించిన ఈ రైల్వే ప్రాజెక్టు 49 ఏళ్లుగా జిల్లా ప్రజలను ఊరిస్తునే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మంత్రాలయంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతుల సందర్భంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా మంత్రాలయం రైల్వేలైన్‌ను పూర్తిచేస్తామని శ్రీ మఠం అధికారులకు చెప్పినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రస్థావన: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, జిల్లా అంతర్గత వాణిజ్య– వ్యాపార రంగాల అభివృద్ధి కోసం మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్ ప్రస్తావన 49ఏళ్ల క్రితమే పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది. 1970లో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మిగనూరు ప్రాంత నేత వై.గాదెలింగన్న గౌడ్ పార్లమెంట్లో మంత్రాలయం వయా కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని ప్రస్తావించినట్లు పార్లమెంట్ మినిట్స్ బుక్‌లో నమోదైంది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న నేతలు 2002 నుంచి మంత్రాలయం– కర్నూలు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. 2003లో రాష్ట్రానికి చెందిన 14 మంది ఎంపీలు, అప్పటి రైల్వే బోర్డు సభ్యులు ఎర్రంనాయుడుతో కలసి అప్పటి రైల్వే మంత్రి నితీష్కువూర్తో మంత్రాలయం– కర్నూలు రైల్వేను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన 2004 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైన్‌ను ప్రస్తావిస్తూ సర్వే కోసం నిధులు కేటాయించారు. సర్వే పనులు పూర్తి చేసిన రైల్వే ఉన్నతాధికారులు అప్పట్లో రూట్‌మ్యాప్‌ను కూడా రూపొందించారు. మంత్రాలయం క్రాస్ (తుంగభద్ర) నుంచి మాధవరం, ఇబ్రహీపురం, నందవరం, ఎమ్మిగనూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్‌కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, నాగలాపురం, పెద్దకొట్టాల, దూపాడు మీదుగా కర్నూలు రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తూ సర్వే ద్వారా రూట్‌మ్యాప్ రూపొందింది. మెుత్తం 110.700 కి.మీ. మధ్య దూరం గల ఈ రైలు మార్గంలో 14 స్టేషన్లు, 22 మలుపులతో రూట్‌మ్యాప్ తయారైంది. సర్వేలతో సరి మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటుకు 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమత బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల అధికారుల మ«ధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యా పునఃసర్వే చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా 2011 ఫిబ్రవరి 23న రూ.6 కోట్లతో టెండర్లను పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ టెండర్లను దక్కించుకున్నారు. సర్వే పనులు పూర్తి చేసి 2013లో నివేదిక పంపారు. కి.మీ. రూ.6 కోట్లు చొప్పున 110 కి.మీ.లకు రూ.660 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబునాయుడు మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడచిపోయాయిగానీ రైల్వే ప్రాజెక్టుపై శాసనసభలో తీర్మానం కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే బడ్జెట్లో మొండిచేయి చూపడంతో అప్పటి ఎంపీ బుట్టారేణుక కోరడంతో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్ రీసర్వేకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ బీజేపీయే అధికారంలోకి వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో నాగిరెడ్డిపై మాదవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పేమీ లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నాగిరెడ్డిని అరెస్ట్ చేయ్యవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు) ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం కగ్గల్లలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా స్థానికుల సమాచారం. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని బాలనాగిరెడ్డి అన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
మంత్రాలయం: హిందూ సమాజ జాగరణ, హిందూ ధర్మ పరిరక్షణ ప్రతిష్టాపన కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పిలుపునిచ్చారు.ఇతర దేశాల కంటే భారతదేశం ఎంతో శ్రేష్టమైందని కొనియాడారు. సాధు సంతులు, జగద్గురులు, మహానుభావుల పవిత్ర కార్యక్షేత్రంగా అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతావనిలోనే ఉందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శుక్రవారం మంత్రాలయంలో ప్రారంభమయ్యాయి. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేతృత్వంలో ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వన చేసి సమావేశాలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ 36 సంఘ్ పరివార్లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు దాదాపు 202 మంది పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయమన్నారు. పవిత్ర తుంగభద్ర నదీతీరంలో మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. సమాజ క్షేత్రాలపై చర్చ ఎంతో రహస్యంగా సాగుతున్న సమావేశాల్లో భారతదేశంలోని వివిధ సమాజ క్షేత్రాలపై ప్రధాన చర్చ కొనసాగుతున్నట్లు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీబీ వసతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్తమాన సామాజిక స్థితిగతులు, ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, జల సంరక్షణ అంశాలపై మేధో మథనం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం వంటివి ఉండవన్నారు. కేవలం సామాజిక మార్పులపై చర్చించి, భవిష్యత్తు ప్రణాళికలకు రూపకల్పన చేస్తారన్నారు. కాగా.. అమిత్ కూడా ఓ సాధారణ కార్యకర్తే! భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా పాత్ర అమోఘమైనది. పార్టీకి మూలస్తంభంగా ఉన్న ఆయన ఎక్కడికి వెళ్లినా జెడ్ కేటగిరి స్థాయి భద్రత ఉంటుంది. అలాంటి నేత ఓ సామాన్య కార్యకర్త లాగా దర్శనమిచ్చారు. సమావేశాల్లో వేదికపై కాకుండా పాఠాలు నేర్చుకునే విద్యార్థిలా స్టేజీకి బహుముఖంగా కూర్చున్నారు. చర్చలో మేధావుల ప్రసంగాలు వింటూ సాధారణ వ్యక్తిగా నడుచుకోవడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. సమావేశ విరామ సమయంలోనూ ఓ కుర్చీపై అలా సేద తీరుతూ.. తేనీరు తీసుకుంటూ కనిపించారు. ఎక్కడా తన హోదాను ప్రదర్శించకుండా ఓ సామాన్యుడిగా అమిత్‌షా కన్పించడం అందరినీ ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ పద్ధతులను జవదాటకుండా నడుచుకోవడం నిజంగా గొప్ప విషయమని స్థానికులు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఏపీ ప్రచార ప్రముఖ్ భరత్ కుమార్, వివిధ రాష్ట్రాల ప్రచార ప్రముఖ్‌లు, శ్రీమఠం మనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ శ్రీపతిఆచార్, ద్వారపాలక అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ సమావేశాలు ప్రారంభం
మంత్రాలయం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రా లయంలో ప్రారంభమయ్యాయి. స్థానిక తిరు మల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ నేతృత్వంలో ఈ నెల రెండో తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగుతాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేం ద్రతీర్థులు జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశా లకు అంకురార్పణ చేశారు. ముఖ్యఅతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ 36 సంఘ్ పరివార్లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు 202 మంది హాజరయ్యారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ ఇతర దేశాల కంటే భారతదేశం ఎంతో శ్రేష్టమైందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక ఎస్వీబీ వసతి భవన్లో విలేకరులతో మాట్లాడుతూ సమావేశ ఉద్దేశాలను వివరించారు. సామాన్య కార్యకర్తలా అమిత్‌షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమావేశ వేదికపై కాకుండా పాఠాలు నేర్చుకునే విద్యా ర్థిలా స్టేజీకి బహుముఖంగా కూర్చున్నారు. మే ధావుల ప్రసంగాలు వింటూ సాధారణ వ్యక్తిగా నడుచుకోవడం చూపరులను ఆశ్చర్య చకితుల ను చేసింది. సమావేశ విరామ సమయంలోనూ ఓ కుర్చీపై అలా సేద తీరుతూ .. తేనీరు తీసు కుంటూ కనిపించారు. ఆర్ఎస్ఎస్ ఏపీ ప్రచార ప్రముఖ్ భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాఘవేంద్రుల సన్నిధిలో దర్శకేంద్రుడు
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, రచయిత జె.కె.భారవి వేర్వేరుగా శనివారం మధ్యాహ్నం మంత్రాలయం చేరుకున్నారు. మఠం ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలుకగా.. ముందుగా వీరు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత పూజలు చేసుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. -
చెత్తకుండీలో పాత కరెన్సీ నోట్లు
మంత్రాలయం: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే గడువు ముగిసిన నేపథ్యంలో వాటిని దాచుకున్న కొందరు చెత్తకుండీల పాల్జేస్తున్నారు. గురువారం మంత్రాలయం ఆర్అండ్బీ ప్రహరీ సమీపంలోని ఓ చెత్త కుండీలో 8 వెయ్యి నోట్లు, మరో 8 రూ.500 నోట్లు దర్శనమిచ్చాయి. వీధులను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గమనించి సమాచారం ఇవ్వగా ఎస్ఐ శ్రీనివాసనాయక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. -
గంజాయి మొక్కలు స్వాధీనం
మంత్రాలయం : మండల పరిధిలోని బూదూరులో గురువారం ఎక్సైజ్ అధికారులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ లక్ష్మీదుర్గయ్య ఆధ్వర్యంలో గ్రామానికి వెళ్లి గొల్ల నరసన్న సాగు చేసిన మిరప పొలంలో 33 మొక్కలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను తగులబెట్టారు. వీటి విలువ రూ.12వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో తహశీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎక్సైజ్ ఎస్ఐ సునీల్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ రఘురాముడు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
మంత్రాలయంలో రష్యా భక్తులు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు రష్యాకు చెందిన వారు సోమవారం ఆలయానికి వచ్చారు. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా, ఎవ్‌గెనియా అనే మహిళలు మహబూబ్‌నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం వారు మంత్రాలయంలోని శ్రీమఠాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారిని చూసేందుకు అక్కడికి వచ్చిన వారు ఎంతో ఆసక్తి కనబరిచారు. నిత్యం జనాలతో కిటకిటలాడే ఆలయానికి విదేశీయులు సైతం రావటం ఆనందదాయకమని ఆలయాధికారులు తెలిపారు.