వాస్తు దోషం.. ఆ చాంబర్‌ నాకొద్దు: డిప్యూటీ సీఎం | Maharashtra Deputy CM Ajit Pawar Reject Old Chamber | Sakshi
Sakshi News home page

వాస్తు బాగోలేదు.. ఆ చాంబర్‌ నాకొద్దు: డిప్యూటీ సీఎం

Published Thu, Jan 2 2020 8:11 AM | Last Updated on Thu, Jan 2 2020 8:19 AM

Maharashtra Deputy CM Ajit Pawar Reject Old Chamber - Sakshi

సాక్షి, ముంబై : మంత్రాలయ భవనంలో ఆరో అంతస్తులో ఉన్న 602 నంబరు చాంబర్‌ గత ప్రభుత్వానికి అచ్చిరాకపోవడంతో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అజిత్‌ పవార్‌ అందులో ఆసీనులయ్యేందుకు జంకుతున్నారు. ఆ చాంబర్‌కు బదులుగా మరో చాంబర్‌ కావాలని అధికారులను కోరినట్లు తెలిసింది. మంత్రాలయలోని 602 నంబరు చాంబర్‌లో ఇదివరకు రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి ఆసీనులయ్యారు. కానీ, వీరిలో ఎవ్వరు కూడా ఎక్కువ కాలం మంత్రులుగా కొనసాగలేకపోయారు. దీంతో గత సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్‌ పవార్‌ అందులో ఆసీనులయ్యేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఆరో అంతుస్తులో ఉన్న 602 చాంబర్‌కు బదులుగా సామాన్య పరిపాలన విభాగం అప్పర్‌ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంటే చాంబర్‌ను ఇష్టపడుతున్నారు. దీంతో సీతారాం కుంటేను ఆ చాంబర్‌ నుంచి ఖాళీ చేయించి మరో చాంబర్‌కు తరలించే ప్రయత్నం చేయనున్నారు. అందులో అజిత్‌ పవార్‌ ఆసీనులయ్యేందుకు వీలుగా క్యాబిన్‌ను తీర్చిదిద్దనున్నారు.

ఆ రెండే కీలకం.. 
మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించిన మంత్రులందరు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తంతు పూర్తికాగానే మంత్రాలయ భవనంలో ఏ మంత్రికి, ఏ చాంబర్‌ లేదా క్యాబిన్‌ కట్టబెట్టాలనే దానిపై కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆరో అంతస్తులో కీలకమైన ఇద్దరు మంత్రులు అంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్లున్నాయి. కాగా మంత్రాలయలో ఉన్న వివిధ మంత్రుల చాంబర్లతో పోలిస్తే ఈ రెండు చాంబర్లు చాలా విశాలంగా, ఆధునిక అలంకరణతో ఉన్నాయి. కాని 602 చాంబర్‌ను స్వీకరించేందుకు అజిత్‌ పవార్‌ నిరాకరించారు. ఇదివరకు కొనసాగిన బీజేపీ–శివసేన కాషాయ కూటమి ప్రభుత్వం హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. దీంతో ఈ చాంబర్‌లో సీతారాం కుంటే ఆసీనులయ్యారు. కాని మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కొత్తగా ఏర్పాటు చేశారు. పొత్తుకు ముందు జరిగిన పదవుల ఒప్పందంలో ముఖ్యమంత్రి పదవి శివసేన, ఉప ముఖ్య మంత్రి పదవి ఎన్సీపీ వాటాలోకి వచ్చింది. ఆ ప్రకారం ఎన్సీపీకి చెందిన అజీత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నియమాల ప్రకారం పవార్‌ 602 చాంబర్‌లో అజీత్‌ పవార్‌ ఆసీనులు కావాలి. కాని ఆ చాంబర్‌లో మంత్రులుగా, అధికారులు ఆసీనులైన వారు ఎక్కువ కాలం కొనసాగినలేకపోయారు. దీంతో అజీత్‌ పవార్‌ ఆ చాంబర్‌ తనకు అచ్చిరాకపోవచ్చని భావించి దాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది.
 
అగ్ని ప్రమాదమూ తప్పలేదు..
2012లో మంత్రాలయలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు, ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రితోపాటు ఇతర శాఖ చాంబర్లు పూర్తిగా కాలిపోయాయి. అందులో ఉప ముఖ్యమంత్రి చాంబర్‌ (602) కూడా ఉంది. ఈ ఘటనలో నలుగురు మంత్రాలయ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఆ తరువాత రినోవేషన్‌ పనులు పూర్తయిన తరువాత ఈ చాంబర్‌లో ఏక్‌నాథ్‌ ఖడ్సే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండేళ్లలోనే భూ స్కాంలో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోవల్సి వచ్చింది. ఆ తరువాత ఈ చాంబర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి భావుసాహెబ్‌ ఫుండ్కర్‌ పదవీ బాధ్యతలు కొనసాగించారు. కాని దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే ఆయన మృతి చెందారు. ఆ తరువాత ఖాళీ అయిన ఈ చాంబర్‌లో బీజేపీ ప్రభుత్వం హాయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అనీల్‌ బోర్డే పదవీ బాధ్యతలు కొనసాగించారు. ఆ తరువాత కొద్ది నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోర్డే పరాజయం పాలయ్యారు. వీటన్నింటిని బట్టి ఈ చాంబర్‌ అచ్చిరావడం లేదని స్పష్టమవుతోంది. ఈ విషయం అజిత్‌ పవార్‌ చెవిన పడటంతో తిరస్కరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై అజిత్‌ పవార్‌ అలాంటిదేమి లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చాంబర్ల మధ్య సామాన్య పరిపాలన విభాగం అప్పర్‌ ప్రధాన కార్యదర్శి చాంబర్‌ ఉంటే పనులు పారదర్శకంగా జరుగుతాయి. వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చే బాధితులకు, రైతులకు ఒకేచోట పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement