RSS meeting
-
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
మంత్రాలయం: హిందూ సమాజ జాగరణ, హిందూ ధర్మ పరిరక్షణ ప్రతిష్టాపన కోసం ప్రతి భారతీయుడు శ్రమించాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు పిలుపునిచ్చారు.ఇతర దేశాల కంటే భారతదేశం ఎంతో శ్రేష్టమైందని కొనియాడారు. సాధు సంతులు, జగద్గురులు, మహానుభావుల పవిత్ర కార్యక్షేత్రంగా అభివర్ణించారు. భిన్నత్వంలో ఏకత్వం ఒక్క భారతావనిలోనే ఉందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు శుక్రవారం మంత్రాలయంలో ప్రారంభమయ్యాయి. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేతృత్వంలో ఈ నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వన చేసి సమావేశాలను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ 36 సంఘ్ పరివార్లకు చెందిన 54 శాఖల రాష్ట్ర స్థాయి ముఖ్య ప్రచారక్‌లు, ప్రతినిధులు దాదాపు 202 మంది పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సుబుధేంద్రతీర్థులు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాల నిలయమన్నారు. పవిత్ర తుంగభద్ర నదీతీరంలో మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. సమాజ క్షేత్రాలపై చర్చ ఎంతో రహస్యంగా సాగుతున్న సమావేశాల్లో భారతదేశంలోని వివిధ సమాజ క్షేత్రాలపై ప్రధాన చర్చ కొనసాగుతున్నట్లు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీబీ వసతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వర్తమాన సామాజిక స్థితిగతులు, ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, జల సంరక్షణ అంశాలపై మేధో మథనం జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ పరిణామాలు, ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడం వంటివి ఉండవన్నారు. కేవలం సామాజిక మార్పులపై చర్చించి, భవిష్యత్తు ప్రణాళికలకు రూపకల్పన చేస్తారన్నారు. కాగా.. అమిత్ కూడా ఓ సాధారణ కార్యకర్తే! భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌షా పాత్ర అమోఘమైనది. పార్టీకి మూలస్తంభంగా ఉన్న ఆయన ఎక్కడికి వెళ్లినా జెడ్ కేటగిరి స్థాయి భద్రత ఉంటుంది. అలాంటి నేత ఓ సామాన్య కార్యకర్త లాగా దర్శనమిచ్చారు. సమావేశాల్లో వేదికపై కాకుండా పాఠాలు నేర్చుకునే విద్యార్థిలా స్టేజీకి బహుముఖంగా కూర్చున్నారు. చర్చలో మేధావుల ప్రసంగాలు వింటూ సాధారణ వ్యక్తిగా నడుచుకోవడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. సమావేశ విరామ సమయంలోనూ ఓ కుర్చీపై అలా సేద తీరుతూ.. తేనీరు తీసుకుంటూ కనిపించారు. ఎక్కడా తన హోదాను ప్రదర్శించకుండా ఓ సామాన్యుడిగా అమిత్‌షా కన్పించడం అందరినీ ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ పద్ధతులను జవదాటకుండా నడుచుకోవడం నిజంగా గొప్ప విషయమని స్థానికులు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఏపీ ప్రచార ప్రముఖ్ భరత్ కుమార్, వివిధ రాష్ట్రాల ప్రచార ప్రముఖ్‌లు, శ్రీమఠం మనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ శ్రీపతిఆచార్, ద్వారపాలక అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీని హెచ్చరించిన ఖర్గే..!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వచ్చే నెలలో ఢిల్లీలో నిర్వహించబోయే కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించనుందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే రాహుల్ గాంధీని హెచ్చరించినట్టు సమాచారం. ఆరెస్సెస్ ఉచ్చులో పడొద్దనీ, అది పంపే ఆహ్వానాన్ని తిరస్కరించాలనీ, విషతుల్యమైన ఆరెస్సెస్ సభకు హాజరైతే ప్రమాదమని ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన రాహుల్‌ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు సోనియాగాంధీ కూడా ఆరెస్సెస్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్ భారత్: ఆరెస్సెస్ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్ అభిప్రాయాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు. -
ఆరెస్సెస్ వేదికపై రాహుల్!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్ భారత్: ఆరెస్సెస్ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్ అభిప్రాయాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ అయిన ముస్లిం బ్రదర్ హుడ్‌తో ఆరెస్సెస్‌ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ‘వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు’ అని సంఘ్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రాహుల్‌కు భారత్ గురించి తెలియదు గతవారం లండన్ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్‌పై రాహుల్ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై అరుణ్ కుమార్ మండిపడ్డారు. ‘భారత్ గురించి అర్థం చేసుకోనన్ని రోజులు ఆరెస్సెస్ గురించి రాహుల్‌కు అర్థం కాదు. భారత్, భారత సంస్కృతి, వసుధైక కుటుంబకం అన్న గొప్ప ఆలోచన గురించి రాహుల్‌కు కనీస అవగాహన కూడా లేదు. ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా యావత్ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విషయం రాహుల్‌కు అర్థం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులేంటో ఆయనకు తెలియదు’ అని విమర్శించారు. -
ఈసారి తమిళనాడులో సంఘ్ సమావేశాలు!
కోయంబత్తూర్: మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమావేశాలు మార్చి19 నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రారంభం కానున్నాయి. 92 ఏళ్ల సంఘ్ చరిత్రలో తమిళనాడులో సభను నిర్వహించడం ఇదే తొలిసారి. అమృతా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగనున్న ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కార్యదర్శులు సురేశ్ భయ్యాజీ, జోషీ, ఉప కార్యదర్శులు దత్తాత్రేయ హొసబలే, కృష్ణ గోపాల్, సురేశ్ సోనీ తదితరులు హాజరు కానున్నారు. తాజా ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో తమ భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంఘ్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు సభామోదం కోసం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.