మూడు రోజుల పాటు జరిగే ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు మార్చి19 నుంచి కోయంబత్తూర్‌లో ప్రారంభం కానున్నాయి.
కోయంబత్తూర్: మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సమావేశాలు మార్చి19 నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రారంభం కానున్నాయి. 92 ఏళ్ల సంఘ్ చరిత్రలో తమిళనాడులో సభను నిర్వహించడం ఇదే తొలిసారి. అమృతా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగనున్న ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కార్యదర్శులు సురేశ్ భయ్యాజీ, జోషీ, ఉప కార్యదర్శులు దత్తాత్రేయ హొసబలే, కృష్ణ గోపాల్, సురేశ్ సోనీ తదితరులు హాజరు కానున్నారు.
తాజా ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శనతో తమ భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సంఘ్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు సభామోదం కోసం వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.