పాల్వంచ, న్యూస్‌లైన్: జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్ట్ అవివీతి అక్రమాలకు అడ్డాగా మారింది. మన రాష్ట్రం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే మార్గంలో నాగారం స్టేజీ సమీపంలో ఉన్న ఈ ఏకైక చెక్‌పోస్ట్ కాసుల పంట కురిపిస్తోంది. నిత్యం ఈ రహదారిలో వెళ్లే వాహనాల నుంచి అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. సిబ్బంది ఇలా వసూలు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని ఉన్నతాధికారులకు కూడా ముట్టజెపుతుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ చెక్‌పోస్ట్‌పై ఆదివారం ఉదయం జరిగిన ఏసీబీ దాడితో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆపరేటర్ వేణు అక్రమంగా వసూలు చేసిన రూ.13,650 ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రాత్రే లారీల నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదు ఇంత మొత్తంలో ఉండడం గమనార్హం. ఇలా నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాహనాలకు అన్ని పర్మిట్లు ఉన్నా.. అధికారులకు ఎంతో కొంత ఇచ్చుకోకుండా ఈ చెక్‌పోస్ట్ దాటలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని బీపీఎల్‌కు వెళ్లే కర్రలోడు, పేపర్ కంటైనర్ లోడ్ లారీలు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఐరన్‌ఓర్, నవభారత్, ఎన్‌ఎండీసీ కర్మాగారాల్లో తయారై వైజాగ్ వెళ్లే స్టీల్ ముడిసరుకు, మణుగూరు కోల్‌మైన్ నుంచి తరలే బొగ్గు, అక్రమ ఇసుక, బియ్యం రవాణా, ఇతర నిత్యావసర వస్తువులు, గ్యాస్, పాఠశాల బస్సులు, ఆటోల్లో ఓవర్ లోడు, లెసైన్స్ లేని వాహనాలు, రాష్ట్రాలు దాటి వచ్చే వాహనాలు.. ఇలా ఏది వెళ్లినా డబ్బు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఇలా రోజుకు రూ. 30 వేల నుంచి 50 వేల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కాసుల పంట పండిస్తున్న ఇసుక అక్రమ రవాణ..
గోదావరి పరివాహక ప్రాంత సమీపంలో ఉన్న భద్రాచలం, గొమ్మూరు, సారపాక ర్యాంపులు, చర్ల, వెంకటాపురం, గొమ్ము కొత్తగూడెం, కొల్లుగూడెం, కిన్నెరసాని వాగు నుంచి నిత్యం అక్రమంగా ఇసుక రవాణా చేసే లారీలు ఈ చెక్‌పోస్ట్‌కు కాసులు కురిపిస్తున్నాయి. ఈ వాహనాల్లో పరిమితికి మించి అధిక టన్నుల ఇసుకను తరలిస్తుంటారు. ఇందుకు గాను వే బ్రిడ్జిల నుంచి తప్పుడు బిల్లులు సృష్టించి తీసుకెళుతున్న వాటికి ఆర్టీఏ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకుండా డబ్బు వ సూలు చేసి పంపిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. లారీల తరలిస్తున్న దందాలో ఆర్టీఏ అధికారులతో పాటు పోలీసులకు కూడా వాటాలు ఉన్నాయనే విమర్శలున్నాయి. వీరి దందాకు ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతల అండదండలు సైతం పుష్కలంగా ఉండటం గమనార్హం.
ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం : ఏసీబీ డీఎస్పీ
అవినీతికి ఆలవాలుగా మారిన ఈ చెక్‌పోస్ట్ అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఏసీబీ డీఎస్పీ పి.సాయిబాబు తెలిపారు. తాము దాడి చేసిన సమయంలో విధుల్లో ఉన్న ఏఎంవీఐ ప్రమీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వేణు ఓ లారీ డ్రైవర్ నుంచి రూ.800 వసూలు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. దీంతో వేణు ఆ మొత్తంతో పాటు అంతకుముందే తన వద్దనున్న రూ.13,650 చెక్‌పోస్ట్ వెనుకకు పడేశాడని, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు.
అక్రమాలకు అడ్డా !
Published Mon, Dec 30 2013 6:35 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement