మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమైయ్యారు.దాంతో రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ ట్రావెల్స్పై తనిఖీలు ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ సమీపంలోని షాపూర్ చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 13 బస్సులను సీజ్ చేశారు.
అలాగే హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై 7, హైదరాబాద్ - ముంబై జాతీయ రహదారిలో 3 బస్సులను సీజ్ చేశారు. విజయవాడలో 16 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ఆహుతి అయింది.
ఆ ఘటనలో 45 మంది మరణించారు. ఆ ఘటనతో నిద్రలో జోగుతున్న రాష్ట్ర రవాణ శాఖ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.దాంతో ప్రైవేట్ ట్రావెల్స్పై తనిఖీల కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు రవాణా శాఖ నిబంధనలను తుంగలోకి తొక్కి నడుపుతున్న దాదాపు వెయ్యి బస్సులను ఆ శాఖ అధికారులు సీజ్ చేశారు.