వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒక డ్రైవర్ కారు కొనుగోలు చేశాడు. కొంతకాలం తరువాత స్క్రాప్ కింద విక్రయించేశాడు. కానీ రవాణాశాఖ అధికారులు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. హడావిడిగా రవాణాశాఖ అధికారులను కలిసి కారును స్క్రాప్ కింద విక్రయించేశానని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికారులు బదులిచ్చారు. ఆఖరికి నాలుగు త్రైమాసికాలు పన్నులు చెల్లించాడు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతుండటారు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నూతన వాహనం కొనుగోలు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు సరి చూసుకోవటమే కాదు.. వాహనాన్ని తీసేసినా.. స్క్రాప్ కింద వేసినా.. ఇతరులకు విక్రయించినా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. జిల్లాలో 5 లక్షల 680 వాహనాలు ఉన్నాయి. వాటిలో లారీలు 21,771, మ్యాక్సీ క్యాబ్‌లు 1320, మోటారు క్యాబ్‌లు 3160, కమర్షియల్ ట్రాక్టర్లు 19,311, ఆటోలు 29,135, స్కూలు బస్సులు 1461తోపాటు ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి.
వాటిలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్ను బకాయిలు ఉన్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 8061 వాహనాలు పన్నులు చెల్లించనవిగా గుర్తించారు. అయితే ఇప్పటికే సదరు వాహన యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు నిత్యం పన్ను చెల్లించాలని సమాచారం అందజేస్తున్నారు.
లేని వాహనాలు ఎన్నో..
జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 2061 ఉండగా, వాటిలో అనేక వాహనాలు లేనే లేవని అధికారులు గుర్తించారు. వేలాది వాహనాలు ప్రమాదాలకు గురైనవి, వదిలివేయడం, కాలం చెల్లిన వాహనాలను స్క్రాబ్ వేయడం, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవడం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి ప్రధానంగా గుర్తించారు. 8061 వాహ నాల్లో సుమారు 2000–3000 వాహనాలు స్క్రాబ్‌తోపాటు ఇతర అంశాలలో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు, గుర్తించినట్లు సమాచారం.
పన్ను పడుతూనే ఉంది..
వాహనాలకు సంబంధించి యజమానుల వద్ద వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అఽధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలను స్క్రాబ్ వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాబ్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం
వాహనాలను తీసివేయడం, ఫైనాన్స్ సంస్థల వారు తీసుకెళ్లడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాబ్ చేసిన వాహనానికి సంబంధించి ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే దానికి సంంధించిన వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదే క్రమంలో వాహనం స్క్రాబ్ వేసినట్లు దరఖాస్తు చేసుకుని రోడ్డుపై తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని, వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదుకు అవకాశం ఉందని చెబుతున్నారు. వాహన యజమానులు ఈ విషయాన్ని గుర్తించి వాహనాన్ని తీసివేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా, ఇతరత్రా అంశాలు జరిగితే దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచిస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
వాహనాన్ని తీసివేసినా, స్క్రాబ్‌కు వేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే వాహనాలు మన దగ్గర లేకపోయినప్పటికీ త్రైమాసిక పన్నులు, ఆపైగా జరిమానాలు పడుతూనే ఉంటాయని యజమానులు గ్రహించాలి. స్క్రాబ్‌కు వేసినప్పటికీ ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. యజమానులు గుర్తించి వాహనాల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకుని నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి.
– ఇ.మీరప్రసాద్, జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, కడప
Comments
Please login to add a commentAdd a comment