13 ప్రయివేట్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
హైదరాబాద్ : నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్న ప్రయివేట్ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 ప్రయివేట్ బస్సులను సీజ్ చేశారు. అయితే ఈసారి ఆర్టీసీకి చెందిన రెండు గరుడ బస్సులను కూడా సీజ్ చేయడం విశేషం. రాష్ట్రంలో పేరు మోసిన కేశినేని, కాళేశ్వరి, కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేశారు.
ఆర్టీఏ అధికారులు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని టోల్‌గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పర్మిట్లు లేకపోవడంతో పాటు ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వాహనాలను హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. ఇకపై కూడా దాడులు కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు చెప్పారు.
కాగా ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సహారా ట్రావెల్స్ బస్సును జహీరాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో బస్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకుల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా సహారా ట్రావెల్స్ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.