సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ఆర్టీసీ చార్జీల మోత మోగించింది. ఇప్పటికే ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు ఆర్టీసీ ’వడ్డింపు’లు గొంతులో పచ్చివెలక్కాయలా మారనున్నాయి. బస్సు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బస్ టికెట్లపై ప్రభుత్వం పదిశాతం మేర ధరలను పెంచింది. సామాన్యులు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులు సహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, లగ్జరీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచింది. బస్‌పాస్ చార్జీలను సైతం ఆర్టీసీ పెంచింది. పెంచిన చార్జీలు ఈనెల 6వ తేదీ నుంచి అమల్లో కి రానున్నాయి. దీంతో ప్రతిరోజూ జిల్లా లో ప్రయాణికులపై సుమారు రూ.4 లక్షల నుంచి 10 లక్షల వరకు అదనపు భారం పడనుంది.
ప్రభుత్వం పల్లెవెలుగు బస్సులపై కిలోమీటరుకు 4 పైస లు, ఎక్స్‌ప్రెస్‌లపై 7 పైసలు, డీలక్స్‌కు 9పైసలు, లగ్జరీకి 11పైసల మేర పెం చింది. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతిరోజూ ప్రయాణికులపై సుమారు రూ.4 నుంచి 10 లక్షల వరకు అదనపు భారం పడనుందని అంచనా. మెదక్ రీజియన్‌లో 570బస్సులు ఉన్నా యి. పల్లె వెలుగు 388, ఎక్స్‌ప్రెస్‌లు 150, డీలక్స్‌లు 15, లగ్జరీ బస్సులు 17 ఉన్నాయి. ఆయా బస్సులు రోజూ 4 నుంచి 4.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. రీజియన్ పరిధిలో సుమారు రూ.40 నుంచి రూ.45 లక్షల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నట్లు సమాచారం.