ఐదు నిమిషాలకో బస్సు | Godavari Pushkara spl rtc buses | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాలకో బస్సు

Published Mon, Jun 22 2015 1:09 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఐదు నిమిషాలకో బస్సు - Sakshi

ఐదు నిమిషాలకో బస్సు

పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
* ఉత్సవ క్షేత్రాలకు 2,600 బస్సులు.. 50 శాతం అదనంగా చార్జీల పెంపు
* బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు తరలివచ్చే భక్తుల కోసం ప్రతీ ఐదు నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. జూలై 14 నుంచి పన్నెండు రోజులపాటు జరిగే పుష్కరాల సమయంలో గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్రాలకు 2,600 బస్సులు తిప్పాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఆర్టీసీ జేఎండీ రమణరావు మూడు రోజుల పాటు కరీంనగర్‌లో అధికారులతో సమీక్షలు నిర్వహించి ముందస్తు ప్రణాళికను ఖరారు చేశారు. తెలంగాణలోని పది జిల్లాలకుగానూ ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో మిగతా జిల్లాల్లోని అదనపు బస్సులను ఆ ఐదు జిల్లాలకు మళ్లించాలని నిర్ణయించారు. ఈ పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున బస్సుల సంఖ్య విషయంలో రాజీపడొద్దని రమణరావు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు అదనంగా బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు.
 
ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్..
ఇతర ప్రాంతాలకు నడుస్తున్న ఇంద్ర ఏసీ బస్సులనూ పుష్కరాలకు మళ్లించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఆన్‌లైన్‌లో సీట్లు రిజర్వ్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. దీంతోపాటు కౌంటర్ బుకింగ్ కూడా ఉంటుంది. పుష్కరాలు 12 రోజులపాటు కొనసాగనున్నప్పటికీ జూలై 17, 18, 19, 23, 24, 25 తేదీల్లో రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ప్రాంతాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్నందున ఈ నాలుగు క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. వీటితోపాటు మరికొన్ని ముఖ్య క్షేత్రాల్లో తాత్కాలిక బస్సు షెల్టర్లను నిర్మించాలనుకుంటున్నారు. వాటిల్లో ప్రయాణికులతోపాటు, ఆర్టీసీ సిబ్బందికి వసతులు కల్పించనున్నారు. ఇందుకు రూ.1.20 కోట్లు ఖర్చవుతాయని తేల్చిన అధికారులు.. ఆ మొత్తాన్ని సాయంగా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో ప్రస్తుతానికి సొంత డబ్బులతోనే పనులు చేపట్టాలని నిర్ణయించారు.
 
50%  అదనపు చార్జీ!
జాతరలు, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో టికెట్ ధరలను పెంచే ఆర్టీసీ పుష్కరాలకూ ఇదే పద్ధతిని అనుసరించనుంది. సాధారణ టికెట్ ధర కంటే 50% చార్జీని అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. వెళ్లేప్పుడు రద్దీగా ఉండే బస్సులు వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉండనున్నందున టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును వినియోగించుకోవాలనుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement