ఆదిపర్వం..పరిసమాప్తం..
♦ ముగిసిన గోదావరి పుష్కర మహాసరంభం
♦ అట్టహాసంగా ఆది పుష్కరాల ముగింపు వేడుకలు
♦ చివరి రోజు తగ్గిన భక్తుల రద్దీ
♦ 12 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 3.35 కోట్ల మంది పుణ్యస్నానాలు
రాజమండ్రి : ఒక మహాసంరంభానికి తెరపడింది. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద పండగగా నిలిచిన.. పన్నెండు రోజులపాటు సాగిన.. గోదావరి పుష్కర మహాపర్వం శనివారం సాయంత్రం 6.38 గంటలకు అట్టహాసంగా ముగిసింది. మానవాళితోపాటు సమస్త జీవజాలానికీ జీవనాడిగా మారిన తల్లి గోదావరి మాత రుణం తీర్చుకునేందుకు ఈ జిల్లా జిల్లావాసులతోపాటు.. రాష్ట్రం నలుమూలల నుంచి.. దేశ విదేశాల నుంచి యాత్రికులు కోట్లాదిగా ఈ మహాపర్వం సందర్భంగా పోటెత్తారు. గోదారి మాత ముందు భక్తిప్రపత్తులతో ప్రణమిల్లారు.
వెల్లువెత్తిన భక్తులను చూసి గోదావరి తల్లి కూడా పులకించిపోయింది. పుష్కరాల తొలి రోజే జరిగిన తొక్కిసలాటలో 29 మంది, పుష్కరాలకు వస్తూ ఇంకా అనేకమంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలింది. మరోపక్క పుష్కర పనులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోపక్క ప్రభుత్వం అరకొర సౌకర్యాలు మాత్రమే కల్పించడం యాత్రికులను ఇబ్బందులకు గురి చేసింది. ఏది ఎలా ఉన్నా ఈ మహాపర్వానికి కోట్లాదిగా భక్తులు తరలివచ్చి, విజయవంతం చేశారు.
పుష్కర పర్వానికి ఘనంగా వీడ్కోలు
గోదావరి నదికి మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు జరుగుతాయి. ఈ నెల 14నుంచి ప్రారంభమైన ఆది పుష్కరాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లావాసులు స్పందించారు. శనివారం రాత్రి ఇంటింటా దీపారాధనతో మహిళలు గోదావరి పుష్కరాలకు ఘనమైన వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆధ్వర్యాన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. నిత్యహారతి శోభాయమానంగా జరగడంతోపాటు, లేజర్ కాంతులు పరచిన రంగులతో గోదావరి తీరం ముగ్ధమనోహరంగా మారింది. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన బాణసంచా కాల్పులు ప్రేక్షకులను అలరించాయి.
పెద్ద సంఖ్యలో ఎగురవేసిన ఆకాశ దీపాలు ఆకాశ వీధిలో నక్షత్రాలు ఎగురుతున్నాయా అన్నట్టుగా భ్రమింపజేశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పుష్కర ఘాట్ జనగోదారిగా మారింది. వేడుకల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. తొలి రోజు తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్ బయట గుమిగూడిన ప్రజలను చెల్లాచెదరు చేశారు. ఈ సందర్భంగా వారు దురుసుగా ప్రవర్తించడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు బాబా రామ్‌దేవ్ వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు.
3.35 కోట్ల మంది భక్తులు
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం భక్తులతో పోటెత్తిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ 12 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 3,35,09,316 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 12,32,670 పిండప్రదానాలు జరిగాయి. ఈసారి యాత్రికుల తాకిడి ఒక్క రాజమండ్రి నగరానికే పరిమితం కాలేదు. గ్రామీణ ఘాట్‌లకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లాలోని కోటిపల్లి ఘాట్‌లో 20,51,417 మంది స్నానాలు చేశారు.
చివరి రోజు తగ్గిన తాకిడి
మహాపర్వం చివరి రోజైన శనివారం భక్తుల రాక ఆశించిన స్థాయిలో కనిపించలేదు. రాజమండ్రిలోని కోటిలింగాలు, వీఐపీ, గౌతమ ఘాట్‌లు ఉదయం మినహా, మిగిలిన సమయాల్లో ఖాళీగా దర్శనమిచ్చాయి. రాజమండ్రి నగరంలో రైల్వే, బస్టాండ్‌ల వద్ద కూడా పెద్దగా రద్దీ కనిపించకపోవడం గమనార్హం. అయితే అధికారులు మాత్రం 31,60,599 మంది స్నానాలు చేసినట్టు చెప్పడం విడ్డూరంగా ఉంది. గ్రామీణ ఘాట్‌లలో మాత్రం భక్తజనం యథాతథంగా పోటెత్తారు. చివరి రోజు యాత్రికులకు ఆతిథ్య మర్యాదలు చేసేందుకు రాజమండ్రి నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఏర్పాట్లు చేశాయి. భక్తుల రాక పెద్దగా లేకపోవడంతో వారంతా నిరాశ చెందారు.
మూడు రోజులు మినహా..
గోదావరి పుష్కరాల ఆరంభం నుంచి ముగింపు వరకూ జిల్లాలో గోదావరి తీరం జనజాతరను తలపించింది. పుష్కరాలు ఆరంభమైన తరువాత గత బుధ, గురువారాలు, చివరి రోజైన శనివారం మినహా మిగిలిన రోజుల్లో జనం వరదలా తరలివచ్చారు. గోదావరి జిల్లాలో ప్రవేశించే నెల్లిపాక మండలం గుండాల నుంచి సముద్ర సంగమ ప్రాంతాలైన అంతర్వేది, యానాం, ఓడలరేవు వరకూ గోదావరి తీరం ప్రతి రోజూ జనసంద్రదమైంది. చివరకు గోదావరి కాలువలు ప్రవహించేచోట కూడా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేశారు. గత శని, ఆదివారాల్లో అయితే గోదావరి తీరం జనసునామీని తలపించింది.
ఆ రెండు రోజులూ జిల్లాలో సుమారు 83 లక్షల మంది స్నానాలు చేయగా, ఆదివారం ఒక్కరోజే 42.50 లక్షల మంది స్నానాలు చేశారు. నగరంలోని స్టేడియం రోడ్డులో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయాన్ని 4 లక్షల మంది దర్శించుకున్నారు. సాయంత్రం సమయంలో స్వామివారిని వేదమంత్రాలు, మేళతాళాల నడుమ వీఐపీ ఘాట్ వరకూ తీసుకువెళ్లడం తిరుమల మాడవీధుల్లో జరిగే ఊరేగింపును తలపించింది. కందుకూరి రాజ్యలక్ష్మీ కళాశాలలో ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలను ఏడు లక్షల మంది భక్తులు సందర్శించారు.
ప్రత్యక్ష నరకం చూపించారు
పుష్కరాలకు తరలిరావాలంటూ కోట్ల రూపాయలతో ప్రచారం చేసిన ప్రభుత్వం యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంలో చేతులెత్తేసింది. చాలీచాలని పుష్కర నగర్‌లు, ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక రైళ్లు భక్తులను తీవ్ర అసౌకర్యానికి గురి చేశాయి. మరుగుదొడ్లకు నీరు లేక యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గత శని, ఆదివారాల్లో రాజమండ్రి నగరంతోపాటు జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో భక్తులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. రాజమండ్రి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో వారు పడిన పాట్లు అనీ ఇన్నీకావు.