భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఏ స్నాన ఘట్టాలు ఖాళీగా ఉంటాయి, ఏది సురక్షితం అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకోవాలి.
- అనారోగ్యంతో బాధపడే వారు, బీపీ, షుగర్, కీళ్లనొప్పులున్నవారు, చిన్నారులు, వృద్ధులు గుంపులోకి వెళ్లకుం డా ఉండడమే ఉత్తమం. పుష్కరఘాట్ల వద్ద ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు వృద్ధులు, చిన్నారులకు సేవలందిస్తున్నారు. వారి సేవలు ఉపయోగించుకోవాలి.
- భక్తులు తమ వెంట తప్పనిసరిగా గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌లు, బిస్కట్లు, డ్రైఫ్రూట్స్, బ్రెడ్‌జామ్ వంటివి తీసుకెళ్లాలి.
- అధిక సంఖ్యలో భక్తులు వచ్చే సందర్భాల్లో నాలుగువైపులా గేట్లు ఉండే పుష్కరఘాట్లకు వెళ్లకపోవడం మంచిది. గేట్లు, ప్రహరీలు లేని పుష్కరఘాట్ల వద్దకు వెళ్లడం సురక్షితం.
- భక్తులు తప్పనిసరిగా అధికారుల సూచనలు పాటించాలి. క్రమశిక్షణతో ఉండడం వల్ల ఎదుటివారి ప్రాణాలతో పాటు, తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.
- ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు పుష్కర కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయి. వాటిని భక్తులు నోట్ చేసుకోవాలి.
- పుష్కర స్నానాల్లో ఎవరో భక్తులు తప్పు చేస్తున్నారని, వారితో పాటు మనమూ తప్పులు చేయవద్దు. అలా చేస్తే పుష్కర స్నానాల్లో గందరగోళం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి.
- ఈత రానప్పుడు ఎక్కువ లోతుకు వెళ్లి స్నానం చేయడం మంచిది కాదు.
- పిల్లలు, వృద్ధుల జేబులో వారి వివరాలతో కూడిన చీటీలను ఉంచాలి. రద్దీలో వారు తప్పిపోతే.. గుర్తించడానికి వీలుగా ఉంటుంది.
- వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దు.
అధికారులకు సూచనలు
- సెలవు రోజుల్లో పుష్కర స్నానాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈనెల 18న రంజాన్, 19న ఆదివారం సెలవు కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేయాలి.
- వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోండి. వారిని గైడ్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా తగిన సూచనలివ్వండి.
- భక్తులు స్నానాలు చేసిన తరువాత.. వెంటనే ఘాట్లనుంచి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి.
- గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే.. అధిక లోతు ఉన్నచోటును భక్తులు సులువుగా గుర్తించేలా తాడు గానీ, జెండా వంటివి గాని ఏర్పాటు చేసి అప్రమత్తం చేయాలి. లోతు తక్కువగా ఉన్న చోటే భక్తులు స్నానాలు చేసేలా చూడాలి.
- గజ ఈతగాళ్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
- భక్తులు పడేసిన పదార్థాలతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించి, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలి.
- రైల్వేస్టేషన్‌లలో ఒకేసారి జనం రైలు ఎక్కేందుకు, సీట్లు ఆపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయూ సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. రైలు రాగానే భద్రత వలయం ముందుకు వచ్చి, ఆగిన తర్వాతే ప్రయాణికులు రైలు దిగేలా, ఎక్కేలా చర్యలు తీసుకోవాలి.
- నదీ ప్రాంతం కావడంతో పాములు సంచరించే అవకాశాలుంటాయి. పుష్కర ఘాట్‌ల వద్ద పాముకాటుకు చికిత్స అందించడానికి వైద్యులను, మందులను సిద్ధంగా ఉంచాలి. అవసరమైనవారికి వైద్య సేవలు అందించడానికి అనుభవం ఉన్న వైద్యాధికారులను అందుబాటులో ఉంచాలి.
- వీఐపీల కోసం సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలపవద్దు. ఇలా చేస్తే భక్తుల్లో సహనం నశించి, తొక్కిసలాట జరిగే అవకాశాలుంటారుు.
- రద్దీ తక్కువగా ఉండే పుష్కర ఘాట్‌ల వద్దకు భక్తులను మళ్లించాలి.