ఆరుబయటే నిద్రిస్తున్న భక్తులు
వర్షం పడితే ఇబ్బందులే
డార్మెటరీ భవనం నిరుపయోగం
తెరుచుకోని అక్షరాభ్యాస మండపం
బాసర : పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులను వసతి కష్టాలు వీడడం లేదు. కుటుంబంతో కలిసి వచ్చిన వారికి ఎక్కడ విడిది చేయూలో పాలుపోవడం లేదు. కన్పించిన ఖాళీస్థలంలోనే రాత్రిళ్లు కునుకు తీయూల్సిన స్థితి. వర్షంలోనూ కాలం వెల్లదీయూల్సిన దుస్థితి. విడిది కోసం ఏర్పాటు చేసిన భవనాలు అందుబాటులోకి తేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇదీ.
లడ్డుల తయారీ కోసమే రెండు భవనాలు
ఆదిలాబాద్ జిల్లా బాసరకు పుష్కరస్నానానికి వచ్చే భక్తులు కునుకు తీయడానికి కోటి కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో కల్పించిన సౌకర్యాలు భక్తులకు అందడం లేదు. అన్నదాన సత్రం వెనుక 4.40 కోట్లతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాన్ని అధికారులు లడ్డూల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. విశాలంగా ఉన్న ఈ భవనంలో సుమారు 1000కిపైగా భక్తులు రాత్రి బస చేయవచ్చు. సామన్లను లాకర్లలో భద్రపరుచవచ్చు. అయితే ఈ భవనాన్ని లడ్డూల తయారీ కోసం వినియోగిస్తుండటంతో భక్తులు టీటీడీ భవన సముదాయంలోని చెట్ల కిందే పడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లడ్డూ తయారికి కావాల్సిన సామగ్రిని నిల్వ చేశారు. అయితే పుష్కరాల సమయంలో లడ్డూల తయారీ కోసమే రెండు భవనాలకు కేటాయించడం విశేషం.
తెరుచుకోని మండపం...
బాసర పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో చిన్నారుల అక్షరాభ్యాసం కోసం రూ. 4.25 కోట్లతో నూతన మండపాన్ని నిర్మించారు. పుష్కరాల్లో ఇదే మండపంలో అక్షర శ్రీకార పూజలు జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ ఇప్పటివరకు ఈ మండపం తెరువలేదు. అక్షర శ్రీకార పూజలు జరిపించకపోయినా విశాలంగా ఉన్న ఈ భవనం తెరిచి ఉంచితే రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు వేల మంది నిద్రించేందుకు ఉపయోగపడేది.
ఆరుబయటే భక్తులు...
రాత్రి సమయంలో బాసర చేరుకునే భక్తులంతా ఆరుబయటే నిద్రిస్తున్నారు. వసతి లేకపోవడంతో టీటీడీ భవన సముదాయంలోని ఖాళీ స్థలాల్లో నిద్రిస్తున్నారు. రాత్రి సమయంలో వర్షం కురిస్తే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు తేరుకొని నూతనంగా నిర్మించిన భవనాలను భక్తుల కోసం ఉపయోగించాలి.
పుష్కర భక్తుల కునుకు కష్టాలు..
Published Wed, Jul 22 2015 10:58 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement