ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) బస్సు చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల వరకు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణుల నుంచి అన్ని రకాల ప్రయాణికులపై భారం పడనుంది. పల్లె వెలుగు బస్సులపై 8 శాతం, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులపై 10 శాతం, ఏసీ బస్సులపై 12 శాతం పెరిగాయి. పెరిగిన చార్జీలతో సరాసరి అదనంగా 10 శాతం భారం పడుతోంది. ఈ లెక్కన ఆర్టీసీకి రోజూ రూ.5 లక్షలు, నెలకు రూ.1.50 కోట్లు, ఏడాదికి రూ.18 కోట్లు అదనంగా ఆదాయం రానుండగా, ప్రయాణికుల జేబులకు అంతే మొత్తం చిల్లు పడనుంది. పెరిగిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
4 పైసల నుంచి 12 పైసల వరకు..
పల్లె వెలుగు బస్సులపై కిలో మీటర్‌కు 4 పైసలు పెంచారు. ప్రస్తుతం ఆర్టీసీ కిలో మీటర్‌కు 55 పైసలు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తుండగా దాన్ని 59 పైసలు వసూలు చేయనున్నారు. ఎక్స్‌ప్రెస్‌లో 7 పైసలు పెంచారు. ఇదివరకు 72 పైసలు ఉండగా 79 పైసలు కిలో మీటర్‌కు అవుతుంది. డీలక్స్‌పై 9 పైస లు అదనంగా బాదారు. ప్రస్తుతం కిలో మీటర్‌కు 80 పైసలు ఉండగా 89 పైసలు అవుతుంది. సూపర్ లగ్జ రీ బస్సులు 11 పైసలు పెంచడంతో 94 పైసల నుం చి 105 పైసలకు, ఇంద్ర బస్సులో 12 పైసలు పెంచడంతో 120 పైసల నుంచి 132 పైసలకు చేరుకుంది.
రోజూ రూ.5 లక్షలు వడ్డన
జిల్లాలో 598 ఆర్టీసీ బస్సులు రోజూ రెండున్నర లక్షల కిలో మీటర్లు తిరుగుతాయి. 40వేల లీటర్ల డీజి ల్ వినియోగం అవుతుంది. రీజియన్ పరిధిలో 4 ఏసీ ఇంద్ర బస్సులు ఉండగా రోజూ 1,839 కిలో మీటర్లు తిరుగుతాయి. సూపర్ లగ్జరీ బస్సులు 55 ఉండగా రోజూ 34,838 కిలో మీటర్లు, డీలక్స్ బస్సులు 24 ఉండగా 14,193 కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. ఎక్స్‌ప్రెస్ 135ఉండగా రోజూ 67,741, పల్లె వెలుగు బ స్సులు 381 ఉండగా రోజూ 1,19, 354 కిలో మీటర్లు తిరుగుతాయి. రోజూ సగటున రూ.50 లక్షలు ఆర్టీసీకి ఆదాయం లభిస్తుంది. పెంచిన చార్జీలతో సుమారుగా రూ.55 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓఆర్ పెరిగితేనే గట్టెక్కేది..
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆరు డిపోలు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, ఉట్నూర్ ఉన్నాయి. రోజూ సుమారుగా మూడున్నర లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. గతేడాది ఆక్యుపెన్సీరేషియో(వంద సీట్లకు ప్రయాణికుల శాతం) 69 శాతం ఉండగా ఈ సంవత్సరం 65 శాతానికి పడిపోయింది. ప్రయాణికుల శాతం పెరిగితేనే ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీజియన్ పరిధిలో ఆర్టీసీ ఇప్పటికే రూ.15 కోట్ల నష్టాలబాటలో ఉంది. డీజిల్‌పై రోజూ రూ.23.56 లక్షల వ్యయం అవుతుంది. బస్సుల విడిభాగాలు, టైర్లు, వర్క్‌షాప్ నిర్వహణ భారం, కార్మికుల వేతనాలు కలిపి వెచ్చించే వ్యయానికి రాబడికి అంచనా వేస్తారు. కిలో మీటర్‌కు రూ.28 వ్యయం చేస్తుండగా రాబడి మాత్రం రూ.24.50 పైసలు ఉంది. ఉట్నూర్ డిపో నామమాత్రంగా పనిచేస్తుండగా ఆదిలాబాద్ వంటి డిపో అధిక నష్టాల్లో ఉంది. ప్రయాణికుల ఓఆర్ పెరిగితేనే ఆర్టీసీ మనుగడ సాధిస్తుంది.
ఆర్టీసీ బాదుడు
Published Tue, Nov 5 2013 1:35 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement