నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : ఆసియాలోనే పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. జాతరకు జిల్లా నుంచి ఇప్పటికే భక్తులు బయలుదేరి వెళుతున్నారు. జాతరలో సేవలు అందించేందుకు ఆర్టీసీ, దేవాదాయ శాఖ అధికారులు బయలుదేరి వెళుతున్నారు. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం జిల్లా నుంచి పలు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఇందుకు ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది.
ప్రణాళికలు తయారు చేసుకొని మరీ బస్సులను కేటాయించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు సైతం అక్కడే మకాం వేయనున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ నుంచి 225 బస్సులు, ఆర్‌ఎం, డిపో మేనేజర్లతో పాటు అధికారులు, 450 డ్రైవర్లు, 225 కండక్టర్లు మేడారం జాతరలో ప్రయాణికులకు సేవలు అందించనున్నారు.
తరలనున్న ఆర్టీసీ యంత్రాంగం ..
నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌కు సంబంధించిన అధికారులు అందరూ మేడారం ఏర్పాట్లకు వెళ్లనున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణకాంత్, నిజామాబాద్ డిపో-1, డిపో-2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలకు చెందిన డిపో మేనేజర్లు, సీటీఎమ్, సూపరింటెడెంట్‌లు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. జిల్లా నుంచి 225 బస్సులను జాతరకు కేటాయించారు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక్క కండ క్టర్ చొప్పున బయలు దేరుతున్నారు. వీరే కాక మరికొంత మంది వాలంటీర్లను కూడా తీసుకుంటున్నారు.
ఇలా జిల్లా నుంచి పెద్దసంఖ్యలో మేడారం జాతరలో అధికారులు ప్రయాణికులకు, భక్తులకు సేవలు అందించనున్నారు. వీరంతా సోమవారం వెళ్లి ఈనెల 16వ తేదీ వరకు అక్కడే విధులు నిర్వహించి, 17న జిల్లాకు తిరుగు పయనమవుతారు. జిల్లాలో ఉన్న ఆరు డిపోల నుంచి బస్సులను జాతరకు కేటాయించారు. ఈ బస్సులన్నీ సోమవారం నుంచి మేడారం జాతరకు సంబంధించి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. నిజామాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి పది నిమిషాలకు వరంగల్‌కు బస్సు బయలు దేరుతుందని ఆర్‌ఎం కృష్ణకాంత్ తెలిపారు.
మేడారం జాతరకు ఆర్టీసీ
Published Mon, Feb 10 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement