ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమ్మె రెండవ రోజు గురువారం కూడా జిల్లాలో విజయవంతమైంది. రాజమండ్రి, కాకినాడ,
రాజమండ్రి :ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల సమ్మె రెండవ రోజు గురువారం కూడా జిల్లాలో విజయవంతమైంది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం డిపోలతోపాటు మిగిలిన డిపోల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. సమ్మెను అడ్డుకునేందుకు యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను, కండక్టుర్లును నియమించి, బస్సులు తిప్పినా అవి ప్రయాణికుల అవసరాలకు అరకొరగానే అక్కరకు వచ్చారుు. ఆర్టీసీ అధికారు ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో బస్సులు తిప్పాలన్న యత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
జిల్లాలో తొమ్మిది డిపోలకు సుమారు 840 బస్సులు ఉండగా, కేవలం 437 బస్సులు మాత్రమే తిరిగాయి. మధ్యాహ్నం వరకు కేవలం 200 బస్సులు మాత్రమే తిరిగాయి. చాలా చోట్ల కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని డిపోల వద్ద దారిపై మేకులు, సీసాలు బద్దలు కొట్టి గాజుముక్కలు వేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనితో అధికారులు పోలీసుల సహాయంతో బస్సులు తిప్పారు. శుక్రవారం నుంచి బస్సుల్లో పోలీసులను ఉంచి సర్వీసులు తిరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హామీ ఇచ్చారు.
బస్సులు గురువారం కూడా తిరగవనే అనుమానంతో ప్రయాణికులు రాకపోకలకు ఇతర వాహనాల మీద ఆధారపడ్డారు. దీనితో మధ్యాహ్నం వరకు బస్సులు ఒకరిద్దరు ప్రయాణికులతో బోసిపోరుు కనపించాయి. సాయంత్రం నుంచి ప్రయూణికుల సందడి కొంత పెరిగింది. సగం బసులు తిప్పినా ఆర్టీసీకి వచ్చిన ఆదాయం కొసరే. టిక్కెట్లు ఇవ్వకుండా, వాటి రేటు పెంచి తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు సొమ్ములు జేబులో వేసుకున్నారు. టిక్కెట్ రేటుకు రెట్టింపు వసూలు చేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పేరుకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులని బోర్డుపెట్టినా పాసింజరు బస్సుల్లాగే ప్రతి చోటా ఆపి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. రెండు రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ జిల్లావ్యాప్తంగా రూ.1.80 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు చెబుతున్నారు.
విధులకు హాజరైతే.. ఉద్యోగం పక్కా
ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు, సమ్మెను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగులపై కన్నేసింది. వారిని నయానో.. భయానో దారికి తెచ్చుకుని బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తోంది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు విధులకు వస్తే వారిని పర్మనెంట్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇస్తోంది. లేకుంటే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరింపులకు దిగుతోంది. జిల్లాలో 259 కాంట్రాక్ట్ డ్రైవర్లు, 57 మంది కండక్టర్లు ఉన్నారు. వీరు విధుల్లోకి వస్తే ఇప్పుడున్నవారితో కలిసి మరిన్ని బస్సు సర్వీసులను తిప్పాలని భావిస్తున్నారు.