
కాంట్రాక్ట్ స్థానంలో తాత్కాలిక విధానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేశారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. అయితే, కాంట్రాక్ట్ పద్ధతి స్థానంలో తాత్కాలిక(టెంపరరీ) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. కేవలం నియామక పద్ధతి పేరు మార్పు తప్ప.. విధానపరంగా ఎలాంటి మార్పులను పాలకమండలి తీసుకురాలేదు. కాంట్రాక్ట్ విధానం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అందుకు అనుగుణంగా ప్రభుత్వం లేఖ రాయడంతో ఈ విధానం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక విధానంలో నియమించుకోనున్నారు.
ఈ విధానంలో ఉద్యోగంలో చేరిన వారు.. 480 పని దినాలు లేదా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 9,518 మంది కాం ట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని పాలకమండలి తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా.. వీరి సర్వీసు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, ఈనెల 23లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణను దశలవారీగా పూర్తి చేయనున్నారు.