నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించా రు. రియల్ ఎస్టేట్ మధ్యస్తాలు, సివిల్ పంచాయితీలకు ప్రభుత్వ కార్యాల యాన్నే కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. చి వరకు ఓ మద్యస్తానికి సంబంధించిన రూ.40 లక్షల నగదుతో అడ్డంగా బుక్కయ్యారు. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాం డ్ ఆవరణలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగుజూసిన ఈ సంఘటన సం చలనం సృష్టించింది. విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (డీఎస్పీ) చెంచురెడ్డి కార్యాలయంలో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం నరుకూరుకు చెందిన మారుబోయిన
అశోక్ సోదరుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. విడవలూరుకు చెందిన ఉడా కిషోర్‌కు తమ ఊరి నుంచి కొడవలూరుకు వెళ్లే మార్గంలో 14.6 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం మొత్తాన్ని రూ.90 లక్షలకు కొనుగోలు చేసేందుకు 2011లో అశోక్ ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.30 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తం నాలుగు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత భూముల ధరలు తగ్గడం, మిగిలిన మొత్తం సమకూరకపోవడంతో కిషోర్‌కు అశోక్ సకాలంలో నగదు చెల్లించలేకపోయాడు. నెలలు గడుస్తున్నా అశోక్ నగదు చెల్లించకపోవడంతో కిషోర్ 9.5 ఎకరాలను ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్న మనుబోలుకు చెందిన దేవళ్ల రమణారెడ్డి జీపీ కమ్ సేల్ డీడ్ చేశాడు. ఇది తెలుసుకున్న అశోక్ తాను అడ్వాన్స్‌గా చెల్లించిన నగదు ఇచ్చేయాలని పలుమార్లు కిషోర్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం
కరువైంది. ఇటీవల అశోక్ నగరంలోని తల్వాకర్ జిమ్‌లో చేరాడు. అక్కడ ఆయనకు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డీఎస్పీ లక్కు చెంచురెడ్డితో పరిచయం ఏర్పడింది. క్రమేణా స్నేహితులుగా మారడంతో తనకు నగదు రావాల్సిన విషయాన్ని చెంచురెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు అశోక్.
పంచాయితీ ఇలా..
ఈ సివిల్ పంచాయితీని పరిష్కరించే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నాడు చెంచురెడ్డి. ఇటీవల తన కార్యాలయానికి కిషోర్‌ను పిలిపించి విచారించాడు. తర్వాత దేవళ్ల రమణారెడ్డిని పిలిచి అశోక్‌కు స్థలం అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకుగాను రూ.60 లక్షలు చెల్లించడంతో పాటు, ఆ మొత్తానికి 2011 నుంచి వందకి రూపాయి వంతున వడ్డీ చెల్లిస్తాడని ఒప్పించాడు. ఇష్టం లేకున్నా డీఎస్పీ ఒత్తిడి మేరకు అశోక్‌కు స్థలాన్ని అప్పగించేందుకు కిషోర్, రమణారెడ్డి సిద్ధపడ్డారు.
అయితే తమకు అశోక్‌పై నమ్మకం లేదని, మంగళవారం రాత్రి లోపు రూ.50 లక్షలు చెల్లిస్తే బుధవారం రిజిస్ట్రేషన్ చేస్తామని షరతు పెట్టారు. ఆ నగదు కోసం రాత్రి 8 గంటల వరకు ఇద్దరూ బస్టాండ్ వద్ద వేచిచూసి వెళ్లారు. అనంతరం 8.30 గంటలకు అశోక్ రూ.40 లక్షలతో అక్కడి వచ్చాడు. రమణారెడ్డి, కిషోర్ వెళ్లిపోయారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తాన్ని తన కార్యాలయంలోని కానిస్టేబుల్ నాగరాజుకు ఇచ్చివెళ్లాలని చెంచురెడ్డి సూచించాడు. డీఎస్పీ ఆదేశాల మేరకు నాగరాజు నగదు బ్యాగ్‌ను బీరువాలో భద్రపరిచారు.
ఏసీబీకి సమాచారం..
డీఎస్పీ పంచాయితీలు చేస్తున్న వ్యవహారం, కార్యాలయంలో నగదు ఉన్న విషయమై మంగళవారం అర్ధరాత్రి ఏసీబీ డీఎస్పీ కె.ఎస్ నన్‌జున్‌డప్పాకు సమాచారం అందింది. వెంటనే ఆయన తన బృందంతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని డీఎస్పీ కార్యాలయంపై దాడి చేశారు. తనిఖీలు నిర్వహించి బీరువాలోని రూ.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నాగరాజును ప్రశ్నించగా డీఎస్పీ ఫోన్‌లో ఆదేశించిన మేరకు ఆ నగదును బీరువాలో పెట్టానని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత డీఎస్పీ చెంచురెడ్డిని పిలిచి విచారించారు. ఇద్దరినీ బుధవారం తెల్లవారుజామున ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అనంతరం అశోక్, కిషోర్‌ను పిలిపించి పూర్తి వివరాలు రాబట్టారు.
ముమ్మరంగా విచారణ
స్వాధీనం చేసుకున్న నగదు డ్రా చేసిన బ్యాంకులు, ఖాతాల వివరాలను, భూములను సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అశోక్ వెల్లడించిన వివరాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన డీఎస్పీ చెంచురెడ్డి సివిల్ వివాదాల్లో తల దూర్చడం, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు తన బీరువాలో దాచడం నేరమని, ఆయనపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేస్తూ ఏసీబీ అధికారులు పోలీసు శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, టి.వి శ్రీనివాసరావు, ఎం. కృపానందం, కానిస్టేబుళ్లు కె. మధుసూదనరావు, ఓ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు ఆర్‌ఐగా వ్యవహరించిన చెంచురెడ్డి అప్పట్లో హోమ్‌గార్డుల ఉద్యోగాల విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
నాకు ఎలాంటి సంబంధం లేదు: డీఎస్పీ చెంచురెడ్డి
స్నేహితునికి సంబంధించిన స్థల వివాదాన్ని మానవతా దృక్పథంతో పరిష్కరించాలనుకున్నా. అయితే ఆ నగదు నా బీరువాలోకి ఎలా వచ్చిందో తెలియదు. ఓ పథకం ప్రకారమే నన్ను ఇరికించారు.
‘ఆర్టీసీ’ డీఎస్పీ సివిల్ పంచాయితీ
Published Thu, Apr 3 2014 3:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement