ఒంగోలు: నగరంలో సిటీ సర్వీసులు తిప్పేందుకు ఆర్టీసీ ఎట్టకేలకు నడుం బిగించింది. నెల్లూరు నుంచి మూడు సర్వీసులు, నిలిపేసిన రెండు సూపర్ లగ్జరీ సర్వీసులను ఆధునికీకరించి ఈనెల 26న సిటీ సర్వీసులుగా నడపాలని తొలుత నిర్ణయించింది.
ఇందులో భాగంగా బుధవారం నగరంలో పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా రూట్‌సర్వే నిర్వహించారు. సర్వే వివరాలు పరిశీలించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పలు మార్పులు సూచించారు. సిటీ సర్వీసులను ఈనెల 26వ తేదీ కాకుండా అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం ప్రారంభించేందుకు మంత్రి ఆమోదం తెలిపారు.
ఆర్‌ఎం ఏమంటున్నారంటే...
ఈ సర్వేపై ఆర్టీసీ ఆర్‌ఎం వీ.నాగశివుడు తన చాంబరులో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలమేరకు 5 మార్గాల్లో సిటీ సర్వీసులను అక్టోబరు 3వ తేదీ సాయంత్రం నుంచి నడపనున్నామన్నారు. త్వరలోనే జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు వస్తే మరిన్ని సర్వీసులను సిటీ బస్సులుగా తిప్పుతామన్నారు.
ముందస్తుగా నగర ప్రజలకు సిటీ సర్వీసులను అలవాటు చేసేందుకు 5 మార్గాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. సిటీ సర్వీసులకు సంబంధించి మొదటి రెండు కిలోమీటర్ల వరకు ఒక స్టేజీగా పరిగణిస్తారు. ఇందుకు కనీస చార్జీ రూ.6 ఉంటుంది. అక్కడ నుంచి స్టేజీకి రూపాయి చొప్పున పెరుగుతుంది. సిటీ సర్వీసు చార్జీకి, పల్లెవెలుగు చార్జీకి వ్యత్యాసం ఉన్నమాట నిజమేనని ఆర్‌ఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ పాసులు ఈ సిటీ సర్వీసుల్లో ప్రయాణించడానికి చెల్లవన్నారు. సిటీ సర్వీసులకు సంబంధించి ప్రత్యేక పాసులు త్వరలోనే వస్తాయని చెప్పారు. స్టూడెంట్స్ సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.
రైట్.. రైట్
Published Thu, Sep 25 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement