సమ్మెలో భాగంగా శనివారం నెల్లూరు ఆర్టీసీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నాలుగో రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తింది. సమ్మెలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు అన్ని డిపోల ఆవరణల్లోనూ ‘వంటా-వార్పూ’ చేపట్టారు. శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయవాడలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో కార్మికులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి సహా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
సిద్ధా, ఆర్టీసీ ఎండీపై బాబు అసహనం..
కార్మికుల సమ్మెను సరిగా డీల్ చేయలేకపోయారని, కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా నిరోధించలేకపోయారని సీఎం చంద్రబాబు.. రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సమ్మెపై శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు సమీక్షించారు. సబ్ కమిటీ ఎంతిమ్మంటే అంత ఫిట్‌మెంట్ ఇస్తామని చంద్రబాబు అన్నట్టు తెలిసింది. కాగా ఫిట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉపసంఘంలోని మంత్రులు యనమల రామకృష్ణుడు, శిద్దా రాఘవరావు, కె.అచ్చెన్నాయుడులు చర్చిస్తారు.
కలసి వస్తున్న కామ్రేడ్లు :ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ, సీసీఎం సహా పది వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. అవి శనివారం సమావేశమై సోమవారం నుంచి సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి.
సమ్మెను ఆపబోం..
ఆర్టీసీ సమ్మె సరికాదని, కార్మికులు విధుల్లో చేరాలని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో... తాము సమ్మెను ఆపబోమని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కోర్టు తీర్పు పూర్తి పాఠం అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి, స్పందిస్తామని వారు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. కోర్టు తదుపరి చేసే వ్యాఖ్యలను బట్టి ఆలోచిద్దామనే ధోరణిలో వారు ఉన్నట్లు సమాచారం. ఆదివారం మంత్రులు చర్చలకు పిలిచినా 43 శాతం ఫిట్‌మెంట్ విషయంలో గట్టిగానే వాదించాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది.