ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్
సాక్షి, విశాఖపట్నం : కొత్త సర్కారు కొలువుదీరాక ఆర్టీసీలో కొత్త జోష్ నెలకొంది. భారీ సంఖ్యలో కొత్త నియామకాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు, ఐచ్ఛిక బదిలీలకు వీలు కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ విజయనగరం జోన్‌లో త్వరలో 700 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నట్టు ఆ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పి.కృష్ణమోహన్ వెల్లడించారు. ఇటీవల ఈడీగా బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► కండక్టరు నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు ఇంజినీరింగ్, పర్సనల్, అకౌంట్స్, స్టోర్స్ విభాగాల్లోని ఏడీసీలు, టీఐ3, డిప్యూటీ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్లకు గతంలో తాత్కాలికంగా పదోన్నతులు పొందిన 62 మందిని క్రమబద్ధీకరిస్తున్నాం. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం.
► కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో విజయనగరం జోన్‌లో 14 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లకు ప్రయోజనం చేకూరుతోంది. మరో 240 పనిదినాలు పూర్తి చేసిన 50 మందికి త్వరలో రెగ్యులరైజ్ చేయబోతున్నాం.
► జోన్ పరిధిలో 700 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్ల నియామకాన్ని చేపట్టనున్నాం. వీరిలో 200 మందిని ఈ నెలలోనే నియమిస్తాం. మిగిలిన వారిని ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు జరుపుతాం. దశల వారీగా వచ్చే ఏడాది డిసెంబర్ లోగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తాం.
► విజయనగరం జోన్‌లో 400 వరకు వివిధ స్థాయిల్లో ఖాళీలున్నాయి. కొన్నింటిని కండక్టర్లకు ఏడీసీలుగా పదోన్నతులిచ్చి భర్తీ చేస్తాం. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి యాజమాన్యం అనుమతి కోరాం.
► కొత్త ప్రభుత్వం అర్టీసీ ఉద్యోగుల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతినిచ్చింది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్‌ల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసే వారు తాము కోరుకున్న చోటుకు బదిలీకి అవకాశం కల్పించింది. 2005 నుంచి ఒక జిల్లా వారు మరో జిల్లాలో పనిచేస్తున్న వారున్నారు. వారి అభీష్టం మేరకు సొంత జిల్లా లేదా ఇతర జిల్లాలకు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే విజయనగరం జోన్‌లో 400 మందికి పైగా అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా బదిలీ కోరుకుంటే ఈనెల 6 వరకు అవకాశం ఉంది. పది రోజుల్లో ఈ అంతర్ జిల్లాల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తాం.
పార్శిల్ కౌంటర్ల ఆధునికీకరణ..
∙సురక్షితంగా లగేజి చేరవేయడం కోసం ఆర్టీసీ నిర్వహిస్తున్న పార్శిల్ కౌంటర్లను ఆధునికీకరణ ప్రక్రియ జరుగుతోంది. జోన్ పరిధిలో ఉన్న పార్శిల్ కౌంటర్లలో సీసీ కెమెరాలు, కంప్యూటరైజేషన్, వెహికల్ ట్రాకింగ్, ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఫిర్యాదుల సెల్‌ను ఈనెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చాం.
60 ఎలక్ట్రిక్ బస్సులకు ప్రతిపాదన..
∙రాష్ట్రంలో 350 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో విశాఖ రీజియన్‌కు 60 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
∙ఆధునిక సదుపాయాలున్న కరోనా బస్సుల పనితీరు బాగున్నా ఆ సంస్థ సేవలు సంతృప్తికరంగా లేవు. లోపాలు తలెత్తిన సత్వరమే సరిచేయాలని కోరుతున్నాం. అయినా జాప్యం జరుగుతోంది. విశాఖ రీజియన్‌లో 8 కరోనా బస్సులు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment