సాక్షి, కర్నూలు: ఎన్నికలు అనగానే తాయిలాల నుంచి మద్యం వరకు అంతా సందడే. ఓటర్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా మద్యం పారించి ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే మద్యం కిక్కు పెంచేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ‘ఇండెంట్లు’ ఇచ్చి అంతకంతకూ పెంచుకుని రహస్య ప్రదేశాల్లో భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేశారు. తర్వాత అధిక రేట్లకు బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపడింది.
నాలుగు మద్యం దుకాణాలు సీజ్
ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించారు. గూడూరులో నందవరం అక్షిత వైన్స్‌లో 70 కేసుల మద్యం, గూడూరులో సూర్య వైన్స్‌లో 1,076 బాక్సులు, నంద్యాల సూర్య వైన్స్‌లో 200 బాక్సులు, బేతంచర్ల రమ్య వైన్స్‌లో 300 బాక్సులు మద్యాన్ని ఆయా దుకాణాలకు దూరంగా రహస్యంగా నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని షాపులను మొత్తం సీజ్ చేశారు.
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నందవరం మద్యం దుకాణం టీడీపీకి చెందిన కౌన్సిలర్ రామకృష్ణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల, బేతంచర్ల, గూడూరులో కూడా అధికార పార్టీ నాయకుల అనుచరులే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐలు వరలక్ష్మి, లక్ష్మణదాసు నేతృత్వంలో గూడూరు, నందవరం లో తనిఖీలు నిర్వహించి దుకాణాలు సీజ్ చేయగా నంద్యాల, బేతంచర్లలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారులు దాడుల్లో పాల్గొన్నారు.
కొంతకాలంగా తనిఖీలు శూన్యం
కొంతకాలంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. ప్రతి నెలా సంబంధిత స్టేషన్ అధి కారి లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ అధికారులు మద్యం షాపుల్లో విక్రయాలు, నిల్వలు తదితర అంశాలపై తనిఖీలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో అత్యధిక భాగం అధికార పార్టీకి చెందినవి కావడంతో ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
కొను గోలు కేంద్రాల నుంచి దుకాణాలకు మద్యం తరలించేటప్పుడు ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను ఎక్సైజ్ అధికారు లు తనిఖీ చేయాలి. అలాగే దుకాణాల్లో ఆర్–1, ఆర్–2 రిజిస్టర్లు కూడా విధిగా తనిఖీ చేయాల్సి ఉం ది. గతంలో డీటైల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించేవారు. ఆ విధానానికి స్వస్తి చెప్పడంతో మద్యం వ్యాపారులు దుకాణాల్లోని మద్యాన్నంత బెల్టు షాపులకు అధిక రేట్లకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రహస్య ప్రాంతాల్లో రూ.500 కోట్ల మద్యం నిల్వలు
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు సుమారు రూ.500 కోట్లకు పైగా విలువ చేసే మద్యాన్ని ముందుగానే రహస్య స్థావరానికి తరలించి నిల్వ చేసినట్లు సమాచారం. జిల్లాలో నంద్యాల, కర్నూలులో మద్యం సరఫరా చేసే డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి కొనుగోలు చేసే మద్యమే కాకుండా కర్ణాటక నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల ఐఎంఎల్ డిపోలో వారం రోజులుగా రేషన్ విధానం అమలులోకి వచ్చింది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధానం అమలు చేసి పరిమితంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అధికార పార్టీ నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని జిల్లాలోకి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున అక్రమ మద్యం
ఎన్నికల ప్రకటన వెలువడకముందే అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను వారి వారి నియోజకవర్గాల్లో డంప్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పత్తికొండ, డోన్, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భారీ ఎత్తున అధికార పార్టీ నేతలు మద్యాన్ని నిల్వ చేసి ఊరూరా బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎమ్మార్పీకి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అర్ధరాత్రి కూడా పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. సాధారణ రోజుల్లో ప్రతినెలా వంద కోట్లకు పైగా మద్యం కొనుగోళ్లు జరిగేవి. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీకి చెందిన నాయకులు రెట్టింపు మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment