అధికార పార్టీ సభ్యులే అడ్డుపడితే ఎలా?
సభలో సాధారణ పరిస్థితి కొనసాగేలా డిప్యూటీ చైర్మన్ చూడాలని, అప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు గురించిన సమగ్ర చర్చ జరిగేందుకు వీలుంటుందని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు సూచించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆయనను కోరినప్పుడు వెంకయ్యనాయుడు లేచి నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వెల్లో అప్పటికే ఉన్న సీమాంధ్ర ఎంపీలు, తమిళనాడు ఎంపీలు తమ నినాదాలు కొనసాగించడంతో ఆయన మాట్లాడేది ఒక్క డిప్యూటీ చైర్మన్కు తప్ప ఎవరికీ వినిపించలేదు. సభ సజావుగా సాగితే తప్ప గంభీరమైన ఈ సమస్యపై తాను ఏమీ మాట్లాడలేనని, చర్చలో పాల్గొనలేనని వెంకయ్య అన్నారు. సీమాంధ్రలో ఆరు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయని, తెలంగాణలో వెయ్యి మందికి పైగా ప్రాణత్యాగం చేశారని చెప్పారు. తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని కూడా ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు సంబంధించిన తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటున్నామని, సభను అదుపులో ఉంచాలని కోరారు.
సభను అదుపులో ఉంచాలని, స్వయంగా అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కూడా వెల్లోకి వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేస్తుంటే తానేమీ చేయలేనని అశక్తత వ్యక్తం చేశారు. ఈ సమయంలో కురియన్ కూడా తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తానేం చేయగలనని అన్నారు. ఆందోళన చేస్తున్న సభ్యులపై చర్య తీసుకోవాలని ఎవరైనా ప్రతిపాదిస్తే అందుకు కూడా తాను సిద్ధమేనన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నంత సేపూ నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకయ్య నాయుడి లాంటి సీనియర్ సభ్యుడు మాట్లాడుతుంటే కనీసం వినడానికి కూడా ఎందుకు ప్రయత్నించరని కురియన్ అడిగారు. గందరగోళం తీవ్రంగా ఉండటంతో మరో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.